కమర్షియల్‌ విమానాలు మూడు రెట్లు వృద్ధి | India commercial fleet may reach 2250 by 2035: Airbus | Sakshi
Sakshi News home page

కమర్షియల్‌ విమానాలు మూడు రెట్లు వృద్ధి

Jan 30 2026 3:50 AM | Updated on Jan 30 2026 3:50 AM

India commercial fleet may reach 2250 by 2035: Airbus

2035 నాటికి 2,250కి చేరిక 

9.5 బిలియన్‌ డాలర్లకు ఎంఆర్‌వో మార్కెట్‌  

భారత్‌పై ఎయిర్‌బస్‌ అంచనా 

ప్రస్తుతం 1,250 విమానాల ఆర్డర్ల బ్యాక్‌లాగ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మూడో అతి పెద్ద ఏవియేషన్‌ మార్కెట్‌గా భారత్‌ వృద్ధి చెందే క్రమంలో దేశీయంగా 100 సీట్ల పైగా సామర్థ్యం ఉండే కమర్షియల్‌ విమానాల సంఖ్య వచ్చే దశాబ్ద కాలంలో మూడు రెట్లు పెరుగుతుందని విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్‌ అంచనా వేస్తోంది. దీని ప్రకారం ప్రస్తుతం 850గా ఉన్న సంఖ్య 2035 నాటికి 2,250కి పెరగనుంది. దేశీయంగా ఏవియేషన్‌ మార్కెట్‌ వృద్ధి చెందుతుండటం, అంతర్జాతీయ రూట్లలో కూడా కార్యకలాపాలను విస్తరించడంపై దేశీ విమానయాన సంస్థలు గణనీయంగా దృష్టి పెడుతుండటం తదితర అంశాలు  ఇందుకు దోహదపడనున్నాయి.

వింగ్స్‌ ఇండియా 2026 సందర్భంగా గురువారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎయిర్‌బస్‌ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్‌ జర్జెన్‌ వెస్టర్‌మెయర్‌ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం భారత ఎయిర్‌లైన్స్‌ నుంచి 1,250 విమానాలకు ఆర్డర్ల బ్యాక్‌లాగ్‌ ఉందని వివరించారు. ఏటా సగటున 120–150 వరకు విమానాలను అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

వచ్చే పదేళ్లలో భారత్‌లో ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ వృద్ధి వార్షికంగా 8.9 శాతంగా ఉండొచ్చని, విమానాశ్రయాల సంఖ్య మరో 50 మేర పెరగవచ్చని భావిస్తున్నట్లు వెస్టర్‌మెయర్‌ తెలిపారు. కమర్షియల్‌ విమానాల సంఖ్య పెరగడంతో పాటు వార్షికంగా సరుకు రవాణా సామర్థ్యం పెరిగేందుకు కూడా అవకాశం ఉందని ఆయన చెప్పారు. భారతీయ విమానయాన సంస్థలు సుమారు 1,700 విమానాలకు ఆర్డర్లివ్వగా, ఎయిర్‌బస్‌ దగ్గర 72% బ్యాక్‌లాగ్‌ ఉందని వెస్టర్‌మెయర్‌ తెలిపారు.  

35 వేల మంది పైలట్లు కావాలి.. 
విమానాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో 2035 నాటికి 35,000 మంది పైగా పైలట్లు అవసరమవుతారని, అలాగే సాంకేతిక సిబ్బంది సంఖ్య కూడా మూడు రెట్లు పెరిగి 34,000 స్థాయిలో కావాల్సి ఉంటుందని వెస్టర్‌మెయర్‌ చెప్పారు. ప్రస్తుతం పైలట్ల సంఖ్య 12,000గా, సాంకేతిక సిబ్బంది సంఖ్య సుమారు 11,000గా ఉన్నట్లు ఆయన తెలిపారు. విమానాల సంఖ్య మూడు రెట్లు పెరిగే క్రమంలో భారత్‌ వేగంగా మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్‌ కార్యకలాపాలకి హబ్‌గా ఎదుగుతుందని వెస్టర్‌మెయర్‌ చెప్పారు.

ఎయిర్‌ఫ్రేమ్‌లు, ఇంజిన్లు, విడిభాగాల మార్కెట్‌ 2035 నాటికి మూడు రెట్లు పెరిగి 9.5 బిలియన్‌ డాలర్లకు చేరగలదని పేర్కొన్నారు. ఇక ఫ్లయిట్, గ్రౌండ్, సాంకేతిక కార్యకలాపాల డిజిటలైజేషన్‌తో పాటు సైబర్‌ సెక్యూరిటీ మొదలైన వాటిపై భారతీయ ఎయిర్‌లైన్స్‌ 1 బిలియన్‌ డాలర్ల వరకు వెచ్చించే అవకాశం ఉందన్నారు.

భారత్‌లో తొలిసారిగా రూపొందించి, అసెంబుల్‌ చేసిన ఎయిర్‌బస్‌ సీ–295 ట్విన్‌ ఇంజిన్‌ మీడియం మిలటరీ రవాణా విమానాన్ని 2026 మూడో త్రైమాసికంలో డెలివర్‌ చేయనున్నట్లు వెస్టర్‌మెయర్‌ వివరించారు. ఎయిర్‌బస్‌ హెచ్‌125 హెలికాప్టర్ల కోసం ఫైనల్‌ అసెంబ్లీ లైన్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి డెలివరీలు ప్రారంభం కాగలవని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌ నుంచి 1.5 బిలియన్‌ డాలర్ల మేర కొనుగోళ్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement