టీ20 ఫార్మాట్‌లో ఎప్పుడు ఏ జట్టు గెలుస్తుందో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే, తక్కువ వ్యవధిలో ఆట స్వరూపమే మారిపోతుంది. ఒక్క చిన్న తప్పిదం.. ఒక్క ఆటగాడి అద్భుత ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తుంది. ఇక్కడ చిన్న జట్టు, పెద్ద జట్టు అన్న తేడా పెద్దగా ఉండదు.
ఆ సమయానికి ఎవరిది పైచేయి అయితే, వారే మ్యాచ్ గెలుస్తారు. చిన్న జట్లతో పోలిస్తే పెద్ద జట్లే అధిక అంచనాల ఒత్తిడిలో ఉంటాయి. ఈ కారణంగానే ఫలితాలు తారుమారవుతాయి. పొట్టి ఫార్మాట్‌లో ఇలాంటి ఘటనలను తరుచూ చూస్తుంటాం.
మెగా టోర్నీ అయిన ప్రపంచకప్ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఈ టోర్నీ తొలి ఎడిషన్ నుంచే ఇలాంటి సంచలనాలు నమోదవుతూ వచ్చాయి. త్వరలో ప్రారంభం కానున్న 2026 ఎడిషన్ నేపథ్యంలో పొట్టి ప్రపంచకప్ చరిత్రలో నమోదైన టాప్-5 అతి పెద్ద సంచలనాలపై ఓ లుక్కేద్దాం.
తొలి ఎడిషన్‌లోనే..!
పురుషుల టీ20 ప్రపంచకప్ తొలి ఎడిషన్‌లోనే (2007) అతి పెద్ద సంచలనం నమోదైంది. కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పసికూన జింబాబ్వే 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. జింబాబ్వే ఆటగాళ్లు బ్రెండన్ టేలర్ (60*), ఎల్టన్ చిగుంబురా (3/20) ఈ మ్యాచ్ హీరోలుగా నిలిచారు.
ఇంగ్లండ్‌కు నెదర్లాండ్స్ షాక్
రెండో ఎడిషన్‌లో (2009) మరో సంచలనం నమోదైంది. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై చిన్న జట్టు నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో అనూహ్య విజయం సాధించింది. ఇక్కడ గమనించదగ్గ మరో విశేషమేమిటంటే.. నెదర్లాండ్స్ ఇంగ్లండ్‌ను వారి స్వదేశంలోనే ఓడించడం. టామ్ డి గ్రోత్ (49), ర్యాన్ టెన్ డోషాటే (2/35) నెదర్లాండ్స్ హీరోలుగా నిలిచారు.
పెను సంచలనాల ఎడిషన్
2022 ఎడిషన్‌లో రెండు భారీ సంచలనాలు నమోదయ్యాయి. శ్రీలంకకు నమీబియా.. సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ ఊహించని షాక్‌లు ఇచ్చాయి. నమీబియా తరఫున జాన్ ఫ్రైలింక్ (44), డేవిడ్ వీజ్, బెర్నార్డ్ స్కోల్జ్ (తలో 2 వికెట్లు) హీరోలుగా నిలువుగా.. నెదర్లాండ్స్ తరఫున కాలిన్ అకర్మాన్ (41*), బ్రాండన్ గ్లోవర్ (3/9) అద్భుతం చేశారు.
పాక్‌ను మట్టికరిపించిన పసికూన
2024 ఎడిషన్‌లో మరో పెను సంచలనం నమోదైంది. తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన యూఎస్‌ఏ.. బలాడ్యులమని విర్రవీగే పాక్‌కు కర్రు కాల్చి వాత పెట్టింది. ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ ఆటగాళ్లు మోనాంక్ పటేల్ (50), సౌరభ్ నేత్రవల్కర్ (2/18 + సూపర్ ఓవర్ ) అద్భుత ప్రదర్శనలు చేసి యూఎస్‌ఏకు చారిత్రక విజయాన్ని అందించారు.
ఇదే ఎడిషన్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా పెను సంచలనాలు నమోదు చేసింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి మెగా జట్లకు షాకిచ్చి సెమీఫైనల్ వరకు వెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు త్వరలో ప్రారంభం కాబోయే 2026 ఎడిషన్‌లోనూ పెను సంచలనాలు సృష్టించే ఆస్కారం ఉంది. ఆఫ్ఘన్‌తో పాటు యూఎస్‌ఏ, నేపాల్ కూడా పెద్ద జట్లకు షాకిచ్చే అవకాశం ఉంది.


