టీ20 ప్రపంచకప్-2026కి మరో వారం రోజుల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి శ్రీలంక, భారత్ వేదికలగా షురూ కానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గోనున్నాయి. ఈ 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్ల చొప్పున ఉంటాయి. భారత్, పాక్ గ్రూప్-ఎలో పోటీపడనున్నాయి.
ఆఖరి నిమిషంలో బంగ్లాదేశ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్‌కు ఐసీసీ అవకాశమిచ్చింది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 7న యూఎస్ఎతో తలపడనుంది. సొంతగడ్డపై జరగనుండడంతో టీమిండియా ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.
అదేవిధంగా రన్నరప్ సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా ఈవెంట్‌లో 300 పరుగుల భారీ మార్కును దాటే సత్తా ఉన్న జట్లు ఏవనే విషయంపై శాస్త్రి తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
"ఆస్ట్రేలియా, భారత జట్లకు 300 పరుగులు మార్క్ దాటే సత్తా ఉంది. ఈ రెండు రెండు జట్లలోనూ విధ్వంసం సృష్టించే ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్‌లో ఎవరైనా ఒకరు సెంచరీ సాధిస్తే, జట్టు స్కోరు 300కు చేరువవ్వడం కష్టమేమీ కాదు. ఇక భారత్ ఢిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. టైటిల్‌ను రిటైన్ చేసుకునేందుకు మెన్ ఇన్ బ్లూ ప్రయత్నిస్తుంది.
అంతుకుతోడు ఈ టోర్నీ సొంతగడ్డపై జరగుతోంది. కాబట్టి భారత జట్టుపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. టీ20 ఫార్మాట్‌లో పది నుంచి పదిహేను నిమిషాలు ఆట మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. ఆ సమయంలో భారత్ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుందన్నపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
అయితే భారత జట్టులో బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉంది. కాబట్టి బ్యాటింగ్ పరంగా పెద్దగా సమస్యలు తలెత్తకపోవచ్చు" అని ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 300 పరుగులు పైగా చేసిన ఏకైక జట్టుగా ఇంగ్లండ్ కొనసాగుతోంది.


