
మాంచెస్టర్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తుది అంకానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకుని, సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి టీమిండియా పోరాడుతోంది.
311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వోక్స్ వేసిన తొలి ఓవర్లో స్కోరు బోర్డుపై ‘సున్నా’ పరుగులు ఉండగానే యశస్వి జైస్వాల్(0), సాయి సుదర్శన్(0) వికెట్లను భారత్ కోల్పోయింది.
ఈ సమయంలో కేఎల్ రాహుల్(210 బంతుల్లో 8 ఫోర్లతో 87 నాటౌట్), శుభ్‌మన్ గిల్(167 బంతుల్లో 10 ఫోర్లతో 78 నాటౌట్) ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ స్కోర్‌కు భారత్ ఇంకా 137 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 8 వికెట్లు కావాలి. మాంచెస్టర్ టెస్టును భారత్ డ్రా ము గించాలంటే ఆఖరి రోజు ఆటలో కనీసం రెండు సెషన్ల పాటు వికెట్లు కోల్పోకుండా ఆడాలి. ఈ క్రమంలో భారత జట్టుకు ఓ గుడ్‌న్యూస్ అందింది.
కాలి పాదం ఎముక విరిగిన గాయంతో బాధపడుతున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. ఐదో రోజు ఆటలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ధ్రువీకరించాడు. ఆఖరి రోజు ఆటలో బ్యాటింగ్ చేసేందుకు పంత్ సిద్దంగా ఉన్నాడని కోటక్ నాలుగో రోజు అనంతరం కోటక్ పేర్కొన్నాడు.
ఆరు వారాల విశ్రాంతి?
కాగా మొదటి రోజు ఆట సందర్భంగా పంత్‌కు గాయమైంది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి.. బ్యాట్‌కు తగులుతూ అతడి కుడి కాలి పాదానికి తాకింది. దీంతో అతడు మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు.
ఆ తర్వాత అతడికి స్కానింగ్ తరలించగా మెటాటార్సల్ ఫ్రాక్చర్(పాదంలోని ఎముక విరగడం) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అతడికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొన్నాయి.
కానీ రిషబ్ మాత్రం గాయంతో బాధపడుతూనే రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీ బాదాడు. ఇప్పుడు కూడా ఆఖరి రోజు ఆట భారత్‌కు కీలకం కావడంతో ఈ పోరాట యోధుడు మరోసారి నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేయనున్నాడు.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌కు టీమిండియా సవాల్ విసురుతుందా? ఆఖరి రోజు ఎవరిది?