‘పారిస్‌ పరాజయం పాఠాలు నేర్పింది’ | Indian pistol shooter Isha Singh has been impressing with her recent stellar performance | Sakshi
Sakshi News home page

‘పారిస్‌ పరాజయం పాఠాలు నేర్పింది’

Jun 3 2026 3:42 AM | Updated on Jun 3 2026 3:42 AM

Indian pistol shooter Isha Singh has been impressing with her recent stellar performance

ఆ తర్వాతే రికార్డు విజయాలు

షూటర్‌ ఇషా సింగ్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: భారత పిస్టల్‌ షూటర్‌ ఇషా సింగ్‌ ఇటీవల అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోంది. మ్యూనిక్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణం సాధించడంతో పాటు మరో ఈవెంట్‌లో రజతం కూడా గెలుచుకుంది. అయితే తెలంగాణకు చెందిన 21 ఏళ్ల ఇషా రెండేళ్ల క్రితం జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌లో పూర్తిగా విఫలమైంది. ఆ మెగా ఈవెంట్‌లో ఓటమితో తాను పాఠాలు నేర్చుకున్నానని, అదే కసితో సాధన చేసి మళ్లీ విజయాల బాట పట్టానని ఆమె వ్యాఖ్యానించింది. 

‘ఉదాసీనత వల్లనో లేక అతి విశ్వాసం వల్లనో నేను పారిస్‌ ఒలింపిక్స్‌లో ఓడిపోలేదు. నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నించాను. దాని గురించే ఆలోచిస్తూ తీవ్రమైన ఒత్తిడిని పెంచుకున్నాను. ఆఖరి షాట్‌ వరకు కూడా ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒలింపిక్స్‌ తర్వాత కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాను. దాని నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాను. నాటి పరాజయం నన్ను మానసికంగా దృఢంగా మార్చింది’ అని ఇషా గుర్తు చేసుకుంది. మ్యూనిక్‌లో 25 మీటర్ల విభాగంలో స్వర్ణం గెలిచిన ఇషా, 10 మీటర్ల ఈవెంట్‌లో రజతం అందుకుంది. 

‘ఈసారి ఒత్తిడిని అధిగమించి విజయం సాధించగలిగాను. పదేళ్లుగా ఆడుతున్న అనుభవం నాకు ఉపయోగపడింది. ప్రతీసారి గెలుస్తామని బరిలోకి దిగరాదు. టోర్నీ పేరు, వేదికలు మారవచ్చేమో కానీ మనం ఒకే తరహాలో కష్టపడతాం. అందులో ఎలాంటి మార్పు ఉండదని అర్థం చేసుకోవాలి. మానవమాత్రులం కాబట్టి తప్పులు సహజం. కొన్ని సార్లు మనం అనుకున్న విధంగా జరగదు’ అని ఆమె పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement