
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో 97 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
భారత బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. మంధాన క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించింది. మొత్తంగా 101 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించింది. ఆమెతో పాటు హర్లీన్ డియోల్(47), రోడ్రిగ్స్(44), హర్మన్ ప్రీత్ కౌర్(41) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లంక బౌలర్లలో మల్కీ మదార, విహంగా, కుమారి తలా వికెట్ సాధించారు.
అమన్ అదుర్స్.. నాలుగేసిన రాణా
అనంతరం 343 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక అమ్మాయిల జట్టు భారత బౌలర్ల దాటికి 48.2 ఓవర్లలో 245 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చమీరా ఆతపట్టు(51), నీలాక్షి డి సిల్వా(48), విష్మి గుణరత్నే(36) రాణించారు. మిగితా బ్యాటర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.
భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టగా.. అమన్‌జోత్ కౌర్ మూడు వికెట్లు సాధించారు. కాగా భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన హర్మన్ సేన... 6 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలిచింది.