WTC Final- Ind Vs Aus: అప్పుడు అడ్డుకున్న న్యూజిలాండ్‌.. ఈసారి ఇలా! టీమిండియాకు..

India Qualify WTC Final For 2nd Consecutive Time Helps New Zealand - Sakshi

World Test Championship Final 2023 India Vs Australia: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 ఆఖరి టెస్టు ఫలితం తేలకముందే న్యూజిలాండ్‌ టీమిండియాకు శుభవార్తను అందించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో భారత్‌తో పోటీపడిన శ్రీలంకను ఓడించి.. రోహిత్‌ సేనకు మార్గం సుగమం చేసింది.

సొంతగడ్డపై సత్తా చాటుతూ మొదటి టెస్టులో ఆఖరి బంతి వరకు ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో లంకపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరేందుకు న్యూజిలాండ్‌ గడ్డపై సర్వశక్తులు ఒడ్డిన లంక ఆశలపై ఆఖరి నిమిషంలో నీళ్లు చల్లింది.

ఈ ఓటమితో శ్రీలంక పోటీ నుంచి నిష్క్రమించగా టీమిండియాకు డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్‌ బెర్తు ఖరారైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ వేదికగా జరుగనున్న ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.

అప్పుడలా.. ఇప్పుడిలా
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి 2019- 21 సీజన్‌కు గానూ తొలిసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు అద్భుత విజయాలతో ఫైనల్‌ చేరుకుంది.

కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్సీలోని న్యూజిలాండ్‌ సైతం డబ్ల్యూటీసీ తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో గల ది రోస్‌ బౌల్‌ స్టేడియంలో టీమిండియా- కివీస్‌ మధ్య జూన్‌ 18-23 వరకు ఫైనల్‌ జరిగింది.

నాడు ఓడించి.. నేడు పరోక్షంగా సాయపడి
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ కోహ్లి సేనపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొట్టమొదటి డబ్ల్యూటీసీ టైటిల్‌ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడి మురిసిసోయింది. నాటి మ్యాచ్లో మొత్తంగా ఏడు వికెట్లు పడగొట్టిన కైలీ జెమీషన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇక నాడు టీమిండియా ట్రోఫీ గెలవకుండా అడ్డుకున్న న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ ఈసారి మాత్రం ఆటగాడిగా తమ జట్టును గెలిపించడంతో పాటు భారత జట్టును ఫైనల్‌ చేర్చడంలో పరోక్షంగా ప్రధాన పాత్ర పోషించాడు.

కేన్‌ మామకు జై
ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కేన్‌ బాదిన ఫోర్‌ లంక ఫైనల్‌ ఆశలను చిదిమేయగా.. అషిత ఫెర్నాండో బైస్‌ రూపంలో ఎక్స్‌ట్రా పరుగు ఇచ్చాడు. దీంతో లంక ఓటమి ఖరారు కాగా.. టీమిండియా దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో జూన్‌ 7- 11 వరకు ఆస్ట్రేలియా- భారత్‌ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగనుంది.

రోహిత్‌ సేనకు ఆల్‌ ది బెస్ట్‌
జూన్‌ 12ను రిజర్వ్‌డేగా నిర్ణయించారు. ఈ క్రమంలో వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరిన టీమిండియా ఈసారైనా ట్రోఫీ గెలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. రోహిత్‌ శర్మ డబ్ల్యూటీసీ టైటిల్‌ గెలిచి ఇండియాకు ఐసీసీ ట్రోఫీ అందిస్తే చూడాలని ఉందని పేర్కొంటున్నారు.

చదవండి: Virat Kohli- Steve Smith: కోహ్లి విషయంలో స్మిత్‌ మొన్న అలా.. నిన్న ఇలా! బీసీసీఐ ట్వీట్‌ వైరల్‌
21 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన సంజూ శాంసన్‌

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top