నేడు శ్రీలంకతో భారత్ మూడో టి20
జోరు మీదున్న హర్మన్ బృందం
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
తిరువనంతపురం: భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య టి20 సమరం వేదిక మారుతూ తిరువనంతపురానికి చేరింది. తొలి రెండు మ్యాచ్‌లకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వగా... ఇప్పుడు తర్వాతి మూడు మ్యాచ్‌లు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరగనున్నాయి. ఇప్పటికే 2–0తో ఆధిక్యంలో ఉన్న భారత్ మరో మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు మూడో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తొలి రెండు మ్యాచ్‌లలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన హర్మన్‌ప్రీత్ బృందం ఇక్కడా అదే జోరు కొనసాగించాలని భావిస్తుండగా... ఇక్కడైనా పోటీనిచ్చి సిరీస్‌ను కాపాడుకోవాలని లంక లక్ష్యంగా పెట్టుకుంది.
దీప్తి శర్మ పునరాగమనం...
శ్రీలంకపై ఆడిన గత 11 టి20ల్లో భారత్ 9 గెలిచింది. 2024 జులై తర్వాత మన జట్టుకు ఓటమి ఎదురు కాలేదు. బలమైన బ్యాటింగ్ లైనప్‌తో పాటు పదునైన బౌలింగ్‌తో రెండు మ్యాచ్‌లలో విజయం మన జట్టును వరించింది. జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ తమ బ్యాటింగ్‌తో కీలక పాత్ర పోషించారు. బౌలింగ్‌లో క్రాంతి గౌడ్, శ్రీచరణి, వైష్ణవి ఆకట్టుకోవడంతో లంక భారీ స్కోర్లు చేయడంలో విఫలమైంది.
తొలి మ్యాచ్‌లో 121 పరుగులకే పరిమితమైన జట్టు రెండో టి20లో 128 పరుగులే చేయగలిగింది. రెండో మ్యాచ్‌కు అనారోగ్యం కారణంగా దీప్తి శర్మ దూరం కాగా, ఆమె స్థానంలో వచ్చిన స్నేహ్ రాణా కూడా 4 ఓవర్లలో 11 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీసింది. ఇప్పుడు కోలుకున్న దీప్తి మూడో మ్యాచ్ బరిలోకి దిగనుంది.
తొలి టి20లో ఫీల్డింగ్ పేలవంగా కనిపించినా... దాని నుంచి పాఠాలు నేర్చుకున్న జట్టు గత పోరులో ఆకట్టుకుంది. మూడు రనౌట్లతో ప్రత్యరి్థని పడగొట్టింది. స్మృతి, హర్మన్, రిచాలతో భారత బ్యాటింగ్ బలంగా ఉండగా.. పేస్ బౌలింగ్‌లో అమన్‌జోత్, అరుంధతి రెడ్డి మరోసారి ప్రధాన బాధ్యత తీసుకుంటారు. ఈ మ్యాచ్‌లో కొత్త ప్లేయర్ కమలినితో అరంగేట్రం చేయించే అవకాశాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ పరిశీలిస్తోంది.
సమష్టి వైఫల్యం...
శ్రీలంక పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. బలహీన బ్యాటింగ్‌తో కనిపిస్తున్న జట్టును విజయం దిశగా నడిపించడం కెపె్టన్ చమరి అటపట్టుకు కష్టంగా మారింది. కనీసం 150 పరుగులు కూడా చేయకుండా తాము గెలుపు గురించి ఆలోచించలేమని ఆమె వ్యాఖ్యానించింది. జట్టు లైనప్‌లో చెప్పుకోదగ్గ ప్లేయర్లు ఎవరూ లేరు.
అటపట్టు రెండో టి20లో ఆకట్టుకోగా, ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. ముఖ్యంగా లంక ఎన్నో ఆశలు పెట్టుకొని వరుసగా అవకాశాలు ఇస్తున్న టాపార్డర్ బ్యాటర్ హాసిని పెరీరా తన సత్తాను నిరూపించుకోవడంలో విఫలమైంది. 86 అంతర్జాతీయ టి20లు ఆడినా ఆమె కనీసం ఒక్క అర్ధసెంచరీ కూడా సాధించలేకపోయింది.
అయితే మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో శ్రీలంక గత మ్యాచ్‌లో ఆడిన తుది జట్టునే ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించే అవకాశం ఉంది. విష్మి గుణరత్నే, హర్షిత, కవీషా బ్యాటింగ్‌లో రాణిస్తేనే జట్టుకు అవకాశాలు ఉంటాయి.
పిచ్, వాతావరణం
ఇప్పటి వరకు ఈ మైదానంలో నాలుగు పురుషుల టి20 మ్యాచ్‌లు జరగ్గా, ఒక్క మహిళల మ్యాచ్ కూడా జరగలేదు. అయితే 2023లో జరిగిన చివరి మ్యాచ్‌ను బట్టి చూస్తే బ్యాటింగ్‌కు అనుకూల పిచ్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. వర్షసూచన లేదు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి, షఫాలీ, జెమీమా, రిచా, దీప్తి, అమన్‌జోత్, అరుంధతి, క్రాంతి, వైష్ణవి, శ్రీచరణి.
శ్రీలంక: చమరి అటపట్టు (కెప్టెన్), విష్మి, హాసిని, హర్షిత, నీలాక్షిక, కౌశిని, కవీషా, మల్కి, ఇనోక, కావ్య, శషిణి.


