
ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్
భువనేశ్వర్: సొంతగడ్డపై తొలిసారిగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ పోటీల్లో భారత అథ్లెట్లు అన్ను రాణి, మురళీ శ్రీశంకర్, అనిమేశ్ కుజుర్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. నేడు ఒక రోజు మాత్రమే జరిగే ఈ తృతీయ శ్రేణి ఈవెంట్‌లో 15 దేశాలకు చెందిన 150 పైచిలుకు అథ్లెట్లు ఇందులో పోటీపడుతున్నారు. టోర్నీ ప్రైజ్‌మనీ 25,000 డాలర్లు (రూ.21.89 లక్షలు) కాగా... కళింగ స్టేడియంలో ఆదివారం పోటీలు నిర్వహిస్తారు. లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్ వరుస విజయాలతో జోరుమీదున్నాడు.
ఇదే పట్టుదలను ఇక్కడా కొనసాగిస్తే మరో విజయం ఖాయమవుతుంది. ఈ సీజన్‌లో మెరుగైన వ్యక్తిగత ప్రదర్శన కనబరిచిన 2023 ఆసియా క్రీడల చాంపియన్, జావెలిన్ త్రోయర్ అన్ను రాణి... స్వర్ణంపై కన్నేసింది. ఇటీవలే పోలండ్‌లో జరిగిన మీట్‌లో ఆమె 62.59 మీటర్ల దూరంలో ఈటెను విసిరింది. టోక్యో ప్రపంచ చాంపియన్íÙప్ లక్ష్యంగా తన ఆటతీరుకు మెరుగులు దిద్దుకుంటున్న అన్ను మరోమారు 60 ప్లస్ మీటర్ల ప్రదర్శనను కనబరచాలని ఆశిస్తోంది.
భువనేశ్వర్‌లోని వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తన ప్రదర్శన మరింత మెరుగవుతుందని ఆమె భావిస్తోంది. వచ్చే నెల టోక్యోలో జరిగే ఈవెంట్‌లో ప్రపంచ టాప్ 36 జావెలిన్ త్రోయర్లు అర్హత సాధిస్తారు. అయితే ఇప్పటికే 64 మీటర్ల క్వాలిఫికేషన్ మార్క్‌తో 11 మంది అథ్లెట్లు అర్హత పొందారు. ఇక మిగతా 25 మంది జావెలిన్ త్రోయర్లు ప్రపంచ ర్యాంకింగ్, ప్రదర్శన ద్వారా అర్హత సాధిస్తారు. ఈ నెల 24న జపాన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌తో ఆ 25 మంది అథ్లెట్ల బెర్తులు ఖాయమవుతాయి.
భారత స్ప్రింటర్ అనిమేశ్ కుజూర్ 200 మీటర్ల పరుగు పందెంలో జాతీయ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 42వ స్థానంలో ఉన్న కుజూర్ కూడా టోక్యో బెర్తుపై గంపెడాశలతో ఉన్నాడు. 21 ఏళ్ల ఈ స్ప్రింటర్ నేడు జరిగే ఈవెంట్‌లో 20.16 సెకన్ల టైమింగ్ నమోదు చేస్తే గనక నేరుగా టోక్యో పోటీలకు అర్హత సంపాదిస్తాడు. మహిళా లాంగ్‌జంపర్లు శైలీ సింగ్, అన్సీ సోజన్‌లతో పాటు మొహమ్మద్ అఫ్జల్ (800 మీ. పరుగు), సచిన్ యాదవ్ (జావెలిన్ త్రో), శ్రీలంకకు చెందిన సుమేద రణసింఘే (జావెలిన్ త్రో), రుమేశ్ తరంగ (జావెలిన్ త్రో) ఈ పోటీల బరిలో ఉన్నారు.