సిరీస్‌ అప్పగించేశారు! | Sakshi
Sakshi News home page

సిరీస్‌ అప్పగించేశారు!

Published Sun, Dec 10 2023 4:12 AM

India defeat in the second T20 - Sakshi

ముంబై: భారత మహిళల జట్టు ఆఖరి మ్యాచ్‌ మిగిలుండగానే టి20 సిరీస్‌ను ఇంగ్లండ్‌కు అప్పజెప్పింది. శనివారం జరిగిన రెండో టి20లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో ఇంగ్లండ్‌ 2–0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. టాస్‌ నెగ్గిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌కు మొగ్గు చూపగా ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత అమ్మాయిల జట్టు 16.2 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది.

జెమీమా రోడ్రిగ్స్‌ (33 బంతుల్లో 30; 2 ఫోర్లు) మాత్రమే ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను కొంత వరకు ఎదుర్కోగలిగింది. స్మృతి మంధాన (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ చార్లి డీన్‌ (2/16),  లారెన్‌ బెల్, సోఫీ ఎకిల్‌స్టోన్, సారా గ్లెన్‌ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ త్వరత్వరగా వికెట్లు కోల్పోయి కాస్త తడబడింది.

అయితే చివరకు 11.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు డాని వైట్‌ (0), సోఫియా డన్‌క్లీ (9) విఫలమైనా... అలైస్‌ కాప్సీ (21 బంతుల్లో 25; 4 ఫోర్లు), నట్‌ సీవర్‌ (16) కాసేపు క్రీజులో నిలవడంతో విజయం దక్కింది. సిరీస్‌లో నామమాత్రమైన చివరి టి20 మ్యాచ్‌ నేడు ఇదే వేదికపై జరుగుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement