11 ఫోర్లు, 1 సిక్స్‌తో 34 బంతుల్లో 69 నాటౌట్
రెండో టి20లో 7 వికెట్లతో భారత మహిళల జయభేరి
స్పిన్‌తో కట్టడి చేసిన వైష్ణవి, శ్రీచరణి
2–0కు పెరిగిన ఆధిక్యం
26న తిరువనంతపురంలో మూడో టి20
సాక్షి, విశాఖపట్నం: ఓపెనర్ షఫాలీ వర్మ ధనాధన్ షోతో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన రెండో టి20లో హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయఢంకా మోగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2–0తో ఆధిక్యంలో ఉంది.
మొదట శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులే చేసింది. హర్షిత సమరవిక్రమ (32 బంతుల్లో 33; 4 ఫోర్లు), కెప్టెన్ చమరి (24 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగ్గా ఆడారంతే! భారత బౌలర్లలో తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి (2/23), కొత్త స్పిన్నర్ వైష్ణవి శర్మ (2/32) లంక బ్యాటర్లను కట్టడి చేశారు.
అనంతరం భారత మహిళల జట్టు 11.5 ఓవర్లలోనే మూడే వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (34 బంతుల్లో 69 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. దీంతో 8.1 ఓవర్ల ముందే లక్ష్యం మంచు ముక్కలా కరిగింది.
ఆరంభం నుంచే దూకుడుగా....
చిన్న లక్ష్యాన్ని దూకుడుగా ఛేదించే క్రమంలో స్మృతి మంధాన (14) అవుటైంది. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ షఫాలీకి జెమీమా (15 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) జతయ్యాక స్కోరు వాయువేగంతో దూసుకెళ్లింది. ఇనోక వేసిన ఐదో ఓవర్లో వరుస బౌండరీలు కొట్టిన షఫాలీ... చమరి మరుసటి ఓవర్ మూడు బంతుల్ని 4, 6, 4గా తరలించింది. పవర్‌ప్లేలో 68/1 స్కోరు చేసింది.
తర్వాత జెమీమా కూడా తానేం తక్కువ కాదని 2 ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌తో విరుచుకుపడింది. కాసేపటికి ఆమె అవుట్‌కాగా, 9 ఓవర్లలోనే భారత్ స్కోరు వందకు చేరింది. షఫాలీ 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది.
గెలుపు ముంగిట కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (10) బౌల్డ్ కాగా, రిచా ఘోష్ (1 నాటౌట్) విన్నింగ్ రన్ తీసింది. షఫాలీ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మూడో టి20 తిరువనంతపురంలో ఈ నెల 26న జరుగనుంది.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: విష్మి గుణరత్నే (సి అండ్ బి) క్రాంతి 1; చమరి (సి) అమన్‌జోత్ (బి) స్నేహ్ రాణా 31; హాసిని పెరీరా (సి అండ్ బి) శ్రీచరణి 22; హర్షిత (రనౌట్) 33; కవీశా (సి) అమన్‌జోత్ (బి) శ్రీచరణి 14; నీలాక్షిక (సి) శ్రీచరణి (బి) వైష్ణవి 2; కౌశిని (రనౌట్) 11; శాషిని (సి) స్మృతి మంధాన (బి) వైష్ణవి 0; కావ్య (రనౌట్) 1; మల్కిని (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 128. వికెట్ల పతనం: 1–2, 2–38, 3–82, 4–104, 5–109, 6–121, 7–122, 8–126, 9–128. బౌలింగ్: క్రాంతి గౌడ్ 3–0–21–1, అరుంధతి రెడ్డి 3–0–22–0, స్నేహ్ రాణా 4–1–11–1, అమన్‌జోత్ కౌర్ 2–0–11–0, వైష్ణవి శర్మ 4–0–32–2, శ్రీచరణి 4–0–23–2.
భారత ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) కావ్య (బి) దిల్హారి 14; షఫాలీ వర్మ (నాటౌట్) 69; జెమీమా రోడ్రిగ్స్ (సి) దిల్హారి (బి) కావ్య 26; హర్మన్‌ప్రీత్ (బి) మాల్కి మదర 10; రిచా ఘోష్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (11.5 ఓవర్లలో 3 వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1–29, 2–87, 3–128. బౌలింగ్: మాల్కి మదర 2.5–0–22–1, కావ్య 3–0– 32–1, కవీశా 2–0–15–1, ఇనోక రణవీర 2–0–31–0, చమరి 1–0–17–0, శాషిని 1–0–12–0.


