వీర పాండ్యా... విజయ భారత్‌

India beat Australia by six wickets to win the T20 series - Sakshi

హార్దిక్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌

రెండో టి20లోనూ గెలిచి సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్‌

రాణించిన ధావన్, రాహుల్, కోహ్లి భారీ స్కోరు చేసినా ఓడిన ఆసీస్‌

రేపు ఆఖరి టి20

120 బంతుల్లో 195 పరుగులు... పెద్ద మైదానాలు ఉండే ఆసీస్‌ గడ్డపై అసాధారణ లక్ష్యమే. కానీ భారత బ్యాట్స్‌మెన్‌ అద్భుత ఆటతీరుతో కష్టతరమైన లక్ష్యాన్ని అందుకొని అదరహో అనిపించారు. ముందుగా ఓపెనర్లు రాహుల్‌ పరుగుపెట్టిస్తే... ధావన్‌ జోరందుకున్నాడు. కెప్టెన్‌ కోహ్లి రన్‌రేట్‌ను కాపు కాశాడు. ఇక వీళ్లంతా ఔటైతే భారత్‌ కథ ముగియలేదు... ఛేజింగ్‌ అక్కడితోనే ఆగిపోలేదు. నేనున్నానంటూ హార్దిక్‌ పాండ్యా (22 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొండంత లక్ష్యాన్ని తన విధ్వంసంతో కరిగించగా... ‘బర్త్‌డే బాయ్‌’ శ్రేయస్‌ అయ్యర్‌ తనవంతు పాత్రను పోషించాడు. దాంతో టీమిండియా మరో 2 బంతులుండగానే విజయ తీరాలకు చేరింది. మరో మ్యాచ్‌ మిగిలుండగానే టి20 సిరీస్‌ను సొంతం చేసుకుంది.   

సిడ్నీ: అసలే ఈ పర్యటనలో అచ్చిరాని వేదిక సిడ్నీ. ఆపై కొండంత లక్ష్యం. భారీ ఛేదనలో జడేజాలాంటి నాణ్యమైన బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ లేడు. అయినా సరే భారత్‌ యేటికి ఎదురీదింది. భారీస్కోరును తడబడకుండా ఛేదించింది. ఇక్కడ బాధ్యతాయుత బ్యాటింగ్‌ ముందు బెంబేలెత్తించే బౌలింగ్‌ చిన్నబోయింది. రెండో టి20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గి 2–0తో సిరీస్‌ను పట్టింది. చిత్రంగా వన్డే సిరీస్‌ చేజారిన వేదికపైనే టీమిండియా టి20 సిరీస్‌ చేజిక్కించుకుంది. సిరీస్‌లోని చివరిదైన మూడో టి20 మ్యాచ్‌ మంగళవారం సిడ్నీలోనే జరుగుతుంది.

కోహ్లి టాస్‌ నెగ్గినా ఆసీస్‌నే ఆడించగా... ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ (32 బంతుల్లో 58; 10 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగాడు. స్మిత్‌ (38 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. తర్వాత భారత్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి 195 పరుగులు చేసి గెలిచింది. రాహుల్‌ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్‌), ధావన్‌ (36 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కోహ్లి (24 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ గెలిచేదాకా దంచేశాడు.

వేడ్‌ ధనాధన్‌...
రెగ్యులర్‌ కెప్టెన్‌ ఫించ్‌ గైర్హాజరీలో నాయకత్వం వహించిన వేడ్‌ భారత బౌలర్లను వేటాడాడు. బౌండరీలతో ఇన్నింగ్స్‌కు రాకెట్‌ వేగాన్ని జత చేశాడు. దీంతో 5.1 ఓవర్లలోనే ఆసీస్‌ స్కోరు 50కి చేరింది. శార్దుల్‌ వేసిన ఆ ఓవర్లో మూడు బౌండరీలు కొట్టడంతో మరుసటి ఓవర్లోనే వేడ్‌ 25 బంతుల్లో (10 ఫోర్లు, 1 సిక్స్‌) ఫిఫ్టీ కూడా పూర్తయింది. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన వేడ్‌ నాటకీయంగా ఔటయ్యాడు. సుందర్‌ 8వ ఓవర్‌ చివరి బంతిని గాల్లోకి ఆడాడు. కవర్‌ కోహ్లి సునాయాస క్యాచ్‌ జారవిడిచాడు. క్రీజులో వేడ్, స్మిత్‌ పరుగందుకోవడంతో వెంటనే రాహుల్‌కు త్రో చేయగా స్మిత్‌ వెనక్కి తగ్గాడు. వేడ్‌ వెనుదిరిగేలోపే కీపర్‌ రాహుల్‌ వికెట్లను గిరాటేశాడు. ఆ తర్వాత స్మిత్‌ కుదురుగా ఆడగా... మ్యాక్స్‌వెల్‌ (13 బంతుల్లో 22; 2 సిక్స్‌లు) ఉన్న కాసేపే ముచ్చెమటలు పట్టించాడు. ఆఖర్లో హెన్రిక్స్‌ (18 బంతుల్లో 26; 1 సిక్స్‌) ధాటిగా ఆడటంతో ఆతిథ్య జట్టు భారీస్కోరు చేసింది.  

ఆచితూచి...
భారత్‌ మూడో ఓవర్‌ నుంచి దంచుడు మొదలు పెట్టింది. ఓపెనర్లు రాహుల్, ధావన్‌ తొలి రెండు ఓవర్లు ఆచితూచి ఆడారు. తర్వాత బ్యాట్‌కు పనిచెప్పారు. సిక్స్‌లు, ఫోర్లతో 4.5 ఓవర్లలో టీమిండియా స్కోరు 50కి చేరింది. కాసేపటికే రాహుల్‌ అవుటైనా... వెంటనే కోహ్లి వేగం అందుకోకపోయినా... ధావన్‌ లక్ష్యఛేదనకు అవసరమైన పరుగుల్ని చకచకా చేస్తూ తన అర్ధసెంచరీని 34 బంతుల్లో పూర్తిచేశాడు. దూకుడుగా ఆడే క్రమంలో అతను అవుట్‌కాగా... అప్పుడు కోహ్లి వేగం అందుకున్నాడు. తొలి 11 బంతుల్లో 10 పరుగులే చేసిన కెప్టెన్‌ తర్వాతి 13 బంతుల్లో 30 పరుగులు చేయడంతో ఛేదనకు ఏమాత్రం ఢోకా లేకుండాపోయింది.

పాండ్యా ప్రతాపం...

సామ్సన్‌ ఔటైన 14వ ఓవర్లో హార్దిక్‌ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. గెలిచేందుకు 36 బంతుల్లో 75 పరుగులు కావాలి. ఆండ్రూ టై వేసిన 15వ ఓవర్లో కోహ్లి 2 ఫోర్లు, సిక్స్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. కాసేపటికే అతనూ పెవిలియన్‌ చేరాడు. ఆఖరి 4 ఓవర్లలో 46 పరుగులు చేయాల్సి ఉండగా... శ్రేయస్‌ అయ్యర్‌ (12 నాటౌట్, ఫోర్, సిక్స్‌)తో కలిసి పాండ్యా అదరగొట్టాడు. 19, 20వ ఓవర్లను పూర్తిగా పాండ్యానే ఆడాడు. 19వ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టగా... విజయానికి చివరి ఓవర్లో భారత్‌ 14 పరుగులు చేయాలి. ఈ ఓవర్‌ తొలి బంతిపై రెండు పరుగులు తీసిన పాండ్యా... రెండో బంతిని లాంగాన్‌లో సిక్స్‌గా తరలిం చాడు. మూడో బంతిపై పరుగు రాకున్నా... నాలుగో బంతి ని పాండ్యా డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా సిక్స్‌ కొట్టడంతోనే మ్యాచ్‌ ముగిసింది. భారత్‌ సిరీస్‌తో మురిసింది.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వేడ్‌ (రనౌట్‌) 58; షార్ట్‌ (సి) అయ్యర్‌ (బి) నటరాజన్‌ 9; స్మిత్‌ (సి) పాండ్యా (బి) చహల్‌ 46; మ్యాక్స్‌వెల్‌ (సి) సుందర్‌ (బి) శార్దుల్‌ 22; హెన్రిక్స్‌ (సి) రాహుల్‌ (బి) నటరాజన్‌ 26; స్టొయినిస్‌ (నాటౌట్‌) 16; సామ్స్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 194.
వికెట్ల పతనం: 1–47, 2–75, 3–120, 4–168, 5–171.
బౌలింగ్‌: చహర్‌ 4–0–48–0, సుందర్‌ 4–0–35–0, శార్దుల్‌ 4–0–39–1, నటరాజన్‌ 4–0–20–2, చహల్‌ 4–0–51–1.

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) స్వెప్సన్‌ (బి) టై 30; ధావన్‌ (సి) స్వెప్సన్‌ (బి) జంపా 52; కోహ్లి (సి) వేడ్‌ (బి) సామ్స్‌ 40; సామ్సన్‌ (సి) స్మిత్‌ (బి) స్వెప్సన్‌ 15, హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 42; అయ్యర్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 195.
వికెట్ల పతనం: 1–56, 2–95, 3–120, 4–149.
బౌలింగ్‌: సామ్స్‌ 3.4–0–41–1, అబాట్‌ 2–0–17–0, ఆండ్రూ టై 4–0–47–1, మ్యాక్స్‌వెల్‌ 1–0–19–0, స్వెప్సన్‌ 4–0–25–1, హెన్రిక్స్‌ 1–0–9–0, జంపా 4–0–36–1.

► అంతర్జాతీయ టి20ల్లో 190 పరుగులకుపైగా లక్ష్యాన్ని ఛేదించడం భారత్‌కిది ఏడోసారి. గతంలో ఏ జట్టూ ఇలా చేయలేదు. ఇంగ్లండ్‌ (5 సార్లు) రెండో స్థానంలో ఉంది.

► ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి టెస్టు, వన్డే, టి20 సిరీస్‌లు గెల్చుకున్న రెండో విదేశీ కెప్టెన్‌ కోహ్లి. గతంలో డు ప్లెసిస్‌ (దక్షిణాఫ్రికా) ఈ ఘనత సాధించాడు.  

► అంతర్జాతీయ టి20ల్లో భారత్‌కిది వరుసగా తొమ్మిదో విజయం. ఈ ఫార్మాట్‌లో అత్యధిక వరుస విజయాల రికార్డు అఫ్గానిస్తాన్‌ జట్టు (12 మ్యాచ్‌ల్లో; 2018–2019 సీజన్‌) పేరిట ఉంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top