భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ కీలక ప్రకటన చేసింది. తమ జట్టులో ఓ మార్పు చేసినట్లు మంగళవారం వెల్లడించింది. టీమిండియాతో వన్డే సిరీస్‌లో సత్తా చాటిన యువ పేసర్ క్రిస్టియన్ క్లార్క్ (Kristian Clarke)కు టీ20 జట్టులోనూ చోటు ఇచ్చినట్లు తెలిపింది.
మూడు మ్యాచ్‌లకు
అయితే, తొలి మూడు టీ20లకు మాత్రమే క్లార్క్‌ను ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది. స్టార్ ఆటగాడు మైకేల్ బ్రేస్‌వెల్ (Michael Bracewell) గాయపడిన కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘‘ఇండియాలో పర్యటిస్తున్న బ్లాక్‌కాప్స్ (న్యూజిలాండ్)తో బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్టియన్ క్లార్క్ అక్కడే ఉండిపోతాడు.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉంటాడు. ఇండోర్‌లో ఆదివారం నాటి ఆఖరి వన్డే సందర్భంగా మైకేల్ బ్రేస్‌వెల్ గాయపడ్డాడు. అయినప్పటికీ నాగ్‌పూర్‌లో తొలి టీ20 కోసం అతడు జట్టుతో ప్రయాణిస్తాడు.
అయితే, పిక్కల్లో గాయంతో బాధపడుతున్న అతడి పరిస్థితిని వైద్యులు పర్యవేశక్షిస్తున్నారు. అతడు పూర్తి టూర్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది త్వరలోనే తేలుతుంది’’ అని న్యూజిలాండ్ క్రికెట్ తమ ప్రకటనలో పేర్కొంది.
అరంగేట్రంలోనే..
కాగా మైకేల్ బ్రేస్‌వెల్ కెప్టెన్సీలో టీమిండియాతో వన్డే సిరీస్ ఆడిన కివీస్ జట్టు.. భారత గడ్డపై తొలిసారి సిరీస్ కైవసం చేసుకుంది. ద్వితీయ శ్రేణి జట్టుతోనే 2-1 తేడాతో గిల్ సేనను ఓడించి సత్తా చాటింది. ఇక ఈ సిరీస్ సందర్భంగానే క్రిస్టియన్ క్లార్క్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
కోహ్లికే షాకిచ్చాడు
భారత్‌తో తొలి వన్డేలో హర్షిత్ రాణాను అవుట్ చేసి తన ఖాతాలో తొలి వికెట్ జమచేసుకున్న క్లార్క్.. రెండు, మూడో వన్డేల్లో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు. రెండో వన్డేలో మొత్తంగా 3 వికెట్లు తీసిన 24 ఏళ్ల ఈ రైటార్మ్ మీడియం పేసర్.. మూడో వన్డేలోనూ మూడు వికెట్లతో సత్తా చాటాడు.
ఈ క్రమంలోనే టీ20 సిరీస్ జట్టులోనూ క్రిస్టియన్ క్లార్క్ స్థానం సంపాదించగలిగాడు. ఈ విషయం గురించి న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. ‘‘వన్డే సిరీస్‌లో తన ప్రతిభ ఏమిటో అతడు నిరూపించుకున్నాడు.
తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ రాణించి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అందుకే టీ20 సిరీస్ జట్టులోనూ అతడికి చోటు దక్కింది’’ అని పేర్కొన్నాడు.
టీమిండియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు (అప్‌డేటెడ్)
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జెమీషన్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి, క్రిస్టియన్ క్లార్క్ (మొదటి 3 మ్యాచ్‌లకు).
షెడ్యూల్: జనవరి 21, 23, 25, 28, 31
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి న్యూజిలాండ్ జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.
చదవండి: Sunil Gavaskar: ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి


