Tilak Varma: తిలక్‌ గోల్డెన్‌ డక్‌! ఎందుకు అతడిని ప్రమోట్‌ చేశారు? అలా జరిగి ఉంటే: మాజీ క్రికెటర్‌ అసహనం

Ind vs Ire Tilak Golden Duck Former Cricketer Slams Management Promoting Him - Sakshi

Tilak Varma would be disappointed for sure: ‘‘టీమిండియా మేనేజ్‌మెంట్‌ నిర్ణయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో తిలక్‌ వర్మ తనను తాను నిరూపించుకున్నాడు. ఇక సంజూ శాంసన్‌ వన్‌డౌన్‌లో సరిగ్గా సరిపోతాడు. వీళ్లు లెఫ్టాండర్లా, రైట్‌హ్యాండర్లా అన్న అంశంతో అసలు సంబంధమే లేదు. నిజానికి జట్టులో ఏకంగా ఐదుగురు లెఫ్టాండ్‌ బ్యాటర్లు ఉన్నారు.

తిలక్‌ను ఎందుకు ప్రమోట్‌ చేశారు?
ప్రత్యర్థి జట్టులో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఉన్నాడు. పాల్‌ స్టిర్లింగ్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేయగలడు. అయితే, ఇలాంటి పిచ్‌పై బాల్‌ టర్న్‌ అవ్వదు కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  కాబట్టి కాంబినేషన్ల పేరిట తిలక్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపాల్సిన అవసరం లేదు. నాలుగో స్థానంలో అతడి ప్రదర్శన మెరుగ్గా ఉంది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్‌ అభిషేక్‌ నాయర్‌ అన్నాడు. 

మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో తిలక్‌ వర్మ చక్కగా సరిపోతాడని సహచర హైదరాబాదీకి అండగా నిలిచాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున సత్తా చాటుతున్న తెలుగు తేజం తిలక్‌ వర్మ.. వెస్టిండీస్‌ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

అరంగేట్రంలో సత్తా చాటిన హైదరాబాదీ
కరేబియన్‌ జట్టుతో టీ20 సిరీస్‌ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్టాండర్‌.. ఐదు మ్యాచ్‌లలో కలిపి 173 పరుగులు చేశాడు. 140.65 స్ట్రైక్‌రేటుతో సగటున 57.67 పరుగులు సాధించి సత్తా చాటాడు. దీంతో అతడిపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో తొలి టీ20లో తిలక్‌ అవుటైన తీరు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

పాపం.. గోల్డెన్‌ డకౌట్‌
లక్ష్య ఛేదనలో భాగంగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ హైదరాబాదీ బ్యాటర్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. రైటార్మ్‌ పేసర్‌ క్రెయిగ్‌ యంగ్‌ బౌలింగ్‌లో టకర్‌కు క్యాచ్‌ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. ఈ నేపథ్యంలో అభిషేక్‌ నాయర్‌ జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

తిలక్‌ కూడా నిరాశకు లోనై ఉంటాడు
తిలక్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తేనే మంచి ఫలితాలు రాబట్టవచ్చని చెప్పుకొచ్చాడు. ఇక తాను అవుటైన తీరుకు తిలక్‌ వర్మ కూడా తీవ్ర నిరాశకు లోనై ఉంటాడని నాయర్‌ అభిప్రాయపడ్డాడు. యంగ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌తో తొలి టీ20లో టీమిండియా డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది.

చదవండి: ధోని, యువరాజ్‌ తర్వాత అలాంటి వాళ్లు రాలేదు.. ఇప్పుడు ఇతడు! 
ఐర్లాండ్‌తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top