అద్భుత బ్యాటర్‌.. లోయర్‌ ఆర్డర్‌లో పంపిస్తారా?: కెవిన్‌ పీటర్సన్‌ | Ind vs Eng Didn't Get Batting Order Right: Pietersen Slams Team India Jurel Is | Sakshi
Sakshi News home page

భారత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగ్గా లేదు.. అతడిని లోయర్‌ ఆర్డర్‌లో ఆడిస్తారా?

Jan 29 2025 10:50 AM | Updated on Jan 29 2025 4:02 PM

Ind vs Eng Didn't Get Batting Order Right: Pietersen Slams Team India Jurel Is

రాజ్‌కోట్‌ టీ20(Rajkot T20I)లో టీమిండియా ఆట తీరును ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ విమర్శించాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగ్గా లేకపోవడం వల్లే ఓటమి ఎదురైందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్‌ భారత్‌లో పర్యటిస్తోంది.

ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్‌ మొదలుకాగా.. కోల్‌కతా, చెన్నైలలో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. తద్వారా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన సూర్యకుమార్‌ సేనకు పరాజయం ఎదురైంది.

బ్యాటర్ల వైఫల్యం వల్లే
ఈ మ్యాచ్‌లో భారత్‌ ఇంగ్లండ్‌ చేతిలో 26 పరుగుల తేడా(England Beat India)తో ఓటమిని చవిచూసింది. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా బ్యాటర్ల వైఫల్యమేనని చెప్పవచ్చు. గత రెండు మ్యాచ్‌లలో టీమిండియా టాపార్డర్‌ ఒకే విధంగా ఉంది. ఓపెనర్లుగా సంజూ శాంసన్‌- అభిషేక్‌ శర్మ.. వన్‌డౌన్‌లో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) వచ్చారు. ఇక నాలుగో స్థానంలో తిలక్‌ వర్మ బ్యాటింగ్‌ చేశాడు.

హార్దిక్‌ ఐదో నంబర్‌లో
మూడో టీ20లోనూ ఈ నలుగురి స్థానాలు మారలేదు. కానీ వరుస విరామాల్లో వికెట్లు పడిన వేళ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను మేనేజ్‌మెంట్‌ ప్రమోట్‌ చేసింది. ఐదో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు దిగాడు. మరోవైపు.. లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌ కోసం ఆ తర్వాతి స్థానాల్లో మరో ఇద్దరు ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌(6), అక్షర్‌ పటేల్‌(15)లను రంగంలోకి దించారు.

ఎనిమిదో స్థానంలో జురెల్‌
అదే విధంగా.. అచ్చమైన బ్యాటర్‌ అయిన ధ్రువ్‌ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. ఇక హార్దిక్‌ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఇరవైకి పైగా బంతులు తీసుకుని.. మొత్తంగా 35 బంతుల్లో 40 పరుగులే చేశాడు. ఇదిలా ఉంటే.. ధ్రువ్‌ జురెల్‌ క్రీజులోకి వచ్చే సమయానికి.. టీమిండియా విజయలక్ష్యానికి ఓవర్‌కు పదహారు పరుగులు చేయాల్సిన పరిస్థితి.

ఇలాంటి తరుణంలో ఒత్తిడిలో చిత్తైన జురెల్‌ నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టపోయిన టీమిండియా 145 పరుగులకే పరిమితమైంది. తద్వారా ఇంగ్లండ్‌ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పరాజయం పాలైంది.

అద్భుత నైపుణ్యాలు ఉన్న బ్యాటర్‌ను పక్కనపెట్టి
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ మాట్లాడుతూ.. టీమిండియా అనవసరంగా ఆల్‌రౌండర్లను ముందు పంపిందని అభిప్రాయపడ్డాడు. వారికి బదులు జురెల్‌ను పంపించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నాడు.

ఈ మేరకు.. ‘‘ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ నాకు అస్సలు నచ్చలేదు. ఇది సరైంది కానేకాదు. ధ్రువ్‌ జురెల్‌ అచ్చమైన, స్వచ్ఛమైన బ్యాటర్‌. అద్భుత నైపుణ్యాలు ఉన్న ఆటగాడు. 

లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌ కోసమని అతడిని లోయర్‌ ఆర్డర్‌లో పంపించడం సరికాదు. జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లు కచ్చితంగా కాస్త టాప్‌ ఆర్డర్‌లోనే రావాలి’’ అని కెవిన్‌ పీటర్సన్‌ హిందుస్తాన్‌ టైమ్స్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. 

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌- మూడో టీ20 స్కోర్లు
👉టాస్‌: ఇండియా.. తొలుత ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సూర్య
👉ఇంగ్లండ్‌ స్కోరు:  171/9 (20)
👉ఇండియా స్కోరు: 145/9 (20)
👉ఓవరాల్‌ టాప్‌ రన్‌ స్కోరర్‌: బెన్‌ డకెట్‌(28 బంతుల్లో 51)
👉టీమిండియా టాప్‌ రన్‌ స్కోరర్‌: హార్దిక్‌ పాండ్యా(35 బంతుల్లో 40)
👉ఫలితం: ఇండియాపై 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ గెలుపు
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: వరుణ్‌ చక్రవర్తి(5/24).

చదవండి: అతడొక వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌.. మా ఓటమికి కారణం అదే: సూర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement