
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiwal) శతక్కొట్టాడు. ఓవల్ మైదానంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా వంద పరుగుల మార్కును అందుకున్నాడు. 127 బంతుల్లోసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి శతక ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి.
ఇక ఈ సిరీస్‌లో జైసూకు ఇది రెండో శతకం. అంతకు ముందు లీడ్స్ వేదికగా తొలి టెస్టులో జైస్వాల్ 101 పరుగులు చేశాడు. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో ఉంది.
ఈ క్రమంలో సిరీస్ ఫలితాన్ని తేల్చే ఆఖరిదైన ఐదో మ్యాచ్ లండన్‌లో గురువారం మొదలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అయింది.
హాఫ్ సెంచరీని సెంచరీగా మలిచాడు
తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ రెండు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌కు వచ్చే సరికి జైస్వాల్ గేరు మార్చాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలోనే అర్ధ శతకం (52*) పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. శనివారం దానిని సెంచరీగా మలిచాడు.
టెస్టులలో ఆరోది..
తద్వారా ఈ సిరీస్‌లో రెండో శతకంతో పాటు.. తన టెస్టు కెరీర్‌లో ఆరో సెంచరీని నమోదు చేశాడు. ఇందులో నాలుగు ఇంగ్లండ్ మీద బాదినవే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. 75/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన టీమిండియా 51 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.
నైట్ వాచ్‌మన్ ఆకాశ్ దీప్ అర్ధ శతకం(66)తో చెలరేగగా.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (11) మాత్రం నిరాశపరిచాడు. జైసూతో కలిసి కరుణ్ నాయర్ (9*) పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లండ్.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ అయింది.
చదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్‌కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్