
ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ (Ben Duckett)పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ (Ricky Ponting) ప్రశంసలు కురిపించాడు. బౌలర్ రెచ్చగొడుతున్నా ఏమాత్రం సహనం కోల్పోకుండా.. ఓపికగా ఉన్న తీరు తనను ఆకట్టుకుందని తెలిపాడు. తాను గనుక డకెట్ స్థానంలో ఉండి ఉంటే.. ఆకాశ్ దీప్‌నకు గట్టిగా ఓ పంచ్ ఇచ్చేవాడినంటూ భారత పేసర్ వ్యవహారశైలిని విమర్శించాడు.
కాగా టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య ఐదో టెస్టు రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. లండన్‌లోని ఓవల్ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాక్ క్రాలీ (57 బంతుల్లో 64), బెన్ డకెట్ (38 బంతుల్లో 43) శుభారంభం అందించారు.
ధనాధన్.. ఫటాఫట్
ఇద్దరూ బజ్‌బాల్ ఆటతో వేగంగా పరుగులు రాబడుతూ భారత బౌలర్లను తిప్పలుపెట్టారు. ఈ క్రమంలో ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో బౌండరీలు బాదిన డకెట్.. మరోసారి రివర్స్ స్కూప్ షాట్‌కు యత్నించి.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఈ క్రమంలో క్రీజును వీడుతున్న డకెట్ దగ్గరికి వెళ్లిన ఆకాశ్ దీప్.. అతడి భుజం చుట్టూ చెయ్యి వేసి.. నవ్వుతూ అతడిని స్లెడ్జ్ చేశాడు. ఇందుకు డకెట్ కూడా బదులిచ్చినా అతడి ముఖం మాత్రం కాస్త ప్రశాంతంగానే కనిపించింది. ఇంతలో కేఎల్ రాహుల్ వచ్చి ఆకాశ్ దీప్‌ను అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్లాడు.
నేనైతే ఆకాశ్‌కు ఒక్కటి ఇచ్చేవాడిని
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో జరిగిన ఈ ఘటనపై రిక్కీ పాంటింగ్ స్పందించాడు. ‘‘డకెట్ స్థానంలో మీరు ఉంటే గనుక గట్టిగా పంచ్ ఇచ్చేవారు. అవునా? కాదా? అని స్పోర్ట్స్ ప్రజెంటర్ అడుగగా.. పాంటింగ్ అవునని సమాధానం ఇచ్చాడు.
‘‘కచ్చితంగా నేను అలాగే చేసేవాడిని. ఏదేమైనా గల్లీ క్రికెట్‌లో ఇలాంటివి చూస్తాం. కానీ టెస్టు క్రికెట్‌లో.. అదీ హోరాహోరీగా సాగుతున్న సిరస్‌లో ఇలాంటి ప్రవర్తన సరికాదు. వాళ్లిద్దరు ప్రత్యర్థులు కావొచ్చు. లీగ్ క్రికెట్‌లో భాగంగా ఒకే జట్టుకు ఆడనూ వచ్చు.
ఆటలో ఇలాంటివి మజాను ఇస్తాయి. కానీ సీరియస్‌గా సాగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇలా చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పటి వరకు నాకు బెన్ డకెట్ ఆట ఎంతగానో నచ్చేది. ఇప్పుడు అతడు.. బౌలర్ రెచ్చగొట్టినా సహనం కోల్పోకుండా.. ప్రతిస్పందించకుండా ఉండటం ఇంకా నచ్చింది’’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
రాణించిన సిరాజ్, ప్రసిద్
ఇక రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ను టీమిండియా 247 పరుగులకు ఆలౌట్ చేసింది. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్‌నకు ఒక వికెట్ దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.
ఓపెనర్ కేఎల్ రాహుల్ (7) మరోసారి విఫలం కాగా.. సాయి సుదర్శన్ (11) కూడా స్పల్ప స్కోరుకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 51 పరుగులతో అదరగొట్టగా.. ఆకాశ్ దీప్ నాలుగు పరుగులతో అతడితో కలిసి క్రీజులో ఉన్నాడు.
చదవండి: అతడొక లెజెండ్.. కానీ అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు: భారత స్టార్ బౌలర్
A much needed breakthrough for India 🔥
And a cheeky send-off for Ben Duckett 😜#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/9YaTjcEYOn— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2025