
టీమిండియాతో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. ఒకే ఒక్క మార్పుతో మాంచెస్టర్ బరిలో దిగనున్నట్లు వెల్లడించింది. స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయం వల్ల దూరం కాగా.. అతడి స్థానంలో లియామ్ డాసన్ (Liam Dawson) ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు.
వేలు ఫ్యాక్చర్
ఇదొక్క మార్పు మినహా లార్డ్స్‌లో ఆడిన జట్టుతోనే ఇంగ్లండ్ నాలుగో టెస్టు ఆడనుంది. కాగా భారత్‌తో మూడో టెస్టు సందర్భంగా షోయబ్ బషీర్ ఎడమచేతి వేలికి ఫ్యాక్చర్ అయింది. తన బౌలింగ్‌లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కొట్టిన బంతిని ఆపేందుకు ప్రయత్నించే క్రమంలో బషీర్ గాయపడ్డాడు. దీంతో సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకూ అతడు దూరం కాగా.. బషీర్ స్థానంలో డాసన్ జట్టులోకి వచ్చాడు.
ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ
మరోవైపు.. ఇంగ్లండ్ సెలక్టర్లు.. గాయం నుంచి కోలుకున్న పేసర్ గస్ అట్కిన్సన్‌ను కాదని డాసన్ వైపు మొగ్గు చూపడం విశేషం. కాగా లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన 35 ఏళ్ల లియామ్ డాసన్ దేశీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గత మూడేళ్లలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడు 140కి పైగా వికెట్లు పడగొట్టాడు.
ఈ క్రమంలోనే ఎనిమిదేళ్ల తర్వాత అతడు మరోసారి ఇంగ్లండ్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటికి మూడు టెస్టులు మాత్రమే ఆడిన డాసన్ ఏడు వికెట్లు పడగొట్టాడు.
ఆధిక్యంలో ఇంగ్లండ్
కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ స్వదేశంలో టీమిండియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన స్టోక్స్ బృందం.. ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ సేన చేతిలో 336 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.
అయితే, లార్డ్స్‌లో ఆఖరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో నెగ్గింది. ఫలితంగా 2-1తో ఆధిక్యం సంపాదించింది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు (జూలై 23-27)కు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం వేదిక. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య తొమ్మిది టెస్టులు జరుగగా.. టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.
భారత్‌తో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్, జోఫ్రా ఆర్చర్.
చదవండి: రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే?