రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరీక్షణకు తెరపడింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో వైభవ్‌కు భారత తుది జట్టులో చోటు దక్కింది.
సంజూ శాంసన్ స్ధానంలో వైభవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నారు. దీంతో భారత సీనియర్ జట్టు తరపున డెబ్యూ చేసిన అతి పిన్న వయష్కుడిగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును సూర్యవంశీ బ్రేక్ చేశాడు.
సచిన్ 16 ఏళ్ల వయస్సులోఅరంగేట్రం చేయగా.. వైభవ్ కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ చేతుల మీదగా వైభవ్ భారత క్యాప్‌ను అందుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం రెండు మార్పులు చేసింది. జోష్ టంగ్ ఇంగ్లండ్ తరపున డెబ్యూ చేయగా.. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి వచ్చాడు.

తుదిజట్లు
టీమిండియా
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్
ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్


