Ind VS Ban 2nd ODI: కోహ్లికి బదులు సుందర్‌ను పంపాల్సింది.. అప్పుడు: టీమిండియా మాజీ ఓపెనర్‌

Ind VS Ban 2nd ODI Wasim Jaffer: Could Have Sundar Instead Of Kohli - Sakshi

India tour of Bangladesh, 2022 - 2nd ODI: బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో విరాట్‌ కోహ్లిని ఓపెనర్‌గా పంపడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ విస్మయం వ్యక్తం చేశాడు. శిఖర్‌ ధావన్‌కు జోడీగా కేఎల్‌ రాహుల్‌ లేదంటే వాషింగ్టన్‌ సుందర్‌ను ఆడించాల్సిందని ఈ మాజీ ఓపెనర్‌ అభిప్రాయపడ్డాడు. కాగా బంగ్లా పర్యటనలో వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం నాటి రెండో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే.

టాస్‌ ఓడి ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో రోహిత్‌  వేలికి గాయమైంది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి స్కానింగ్‌ చేయించారు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో భాగంగా హిట్‌మ్యాన్‌ స్థానంలో విరాట్‌ కోహ్లి ఓపెనింగ్‌ చేశాడు. ధావన్‌కు జోడీగా బరిలోకి దిగిన ఈ మాజీ సారథి 5 పరుగులకే పెవిలియన్‌ చేరాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌(82) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు అక్షర్‌ పటేల్‌(56) అర్ధ శతకంతో రాణించినా.. గాయం నొప్పిని పంటిబిగువన భరిస్తూ తొమ్మిదో స్థానంలో వచ్చి రోహిత్‌ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడినా ఫలితం లేకుండా పోయింది. 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలై సిరీస్‌ను 0-2తో చేజార్చుకుంది.

ఆశ్చర్యపోయా..
ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి వసీం జాఫర్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లికి బదులు వాషింగ్టన్‌ సుందర్‌ను ఓపెనర్‌గా పంపాల్సిందని పేర్కొన్నాడు.

‘‘అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో.. లీగ్‌ మ్యాచ్‌లలో విరాట్‌ కోహ్లి అప్పుడప్పుడూ ఓపెనర్‌గా వచ్చినా.. ఈసారి బంగ్లాతో మ్యాచ్‌లో మాత్రం అతడు ఓపెనింగ్‌ స్థానంలో రావడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎప్పటిలాగే రాహుల్‌ వస్తాడనుకున్నా.

కోహ్లి ఎందుకు? సుందర్‌ను పంపినా
ఎందుకంటే తను రెగ్యులర్‌ ఓపెనర్‌. ఒకవేళ ఈసారి ఐదో స్థానంలో రావాలనుకుంటే సుందర్‌ను ధావన్‌కు జోడీ చేయాల్సింది. తద్వారా తనకు అనుకూలమైన మూడో స్థానంలో కోహ్లి, నాలుగో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌, ఐదో స్థానంలో రాహుల్‌ బ్యాటింగ్‌ చేసే వీలుండేది.

కానీ కోహ్లిని ప్రమోట్‌ చేయడం వల్ల బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. గందరగోళం ఏర్పడింది. వాషిం‍గ్టన్‌ సుందర్‌ను ఓపెనర్‌గా పంపితే మెరుగైన ఫలితం ఉండేది’’ అని వసీం జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో వాషిం‍గ్టన్‌ సుందర్‌ నాలుగో స్థానంలో వచ్చి 11 పరుగులు చేశాడు. అయితే, బౌలింగ్‌లో మాత్రం 3 వికెట్ల(37/3)తో మెరిశాడు.

చదవండి: Ind Vs Ban: అద్భుత ఇన్నింగ్స్‌.. అయినా రోహిత్‌ ‘చెత్త’ రికార్డు! రైనాకు సాధ్యమైంది.. హిట్‌మ్యాన్‌ మాత్రం..
Rohit Sharma: సగం సగం ఫిట్‌నెస్‌! ఓటమికి ప్రధాన కారణం వాళ్లే! ఇప్పటికైనా...
Ind A Vs Ban A: సెంచరీతో చెలరేగిన అభిమన్యు ఈశ్వరన్‌.. బంగ్లా బౌలర్లకు చుక్కలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top