Ind Vs Ban: అద్భుత ఇన్నింగ్స్‌.. అయినా రోహిత్‌ ‘చెత్త’ రికార్డు! రైనాకు సాధ్యమైంది.. హిట్‌మ్యాన్‌ మాత్రం..

Ind Vs Ban ODI Series: Rohit Sharma Equals MS Dhoni Unwanted Record - Sakshi

India tour of Bangladesh, 2022- ODI Series- 2nd ODI: ఏడేళ్ల క్రితం.. మళ్లీ ఇప్పుడు బంగ్లాదేశ్‌ గడ్డపై టీమిండియా చేష్టలుడిగింది. ఈసారి మాత్రంపూర్తిగా బంగ్లాదేశ్‌ జట్టు చేతిలో కాకుండా ఆ జట్టులోని ఒక్క ప్లేయర్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకు టీమిండియా ఓడిందని చెప్పొచ్చు.

ఈ ఆల్‌రౌండర్‌ వీరోచిత శతకంతో ఒకదశలో 69/6 స్కోరుతో ఉన్న బంగ్లాదేశ్‌ చివరకు 271/7 చేస్తే... ఛేజింగ్‌లో 172/4 స్కోరుతో ఉన్న భారత్‌ ఆఖరికి 266/9 స్కోరు చేసి ఓడింది. 

మిర్పూర్‌: మరోసారి బంగ్లాదేశ్‌ పర్యటనలో భారత్‌కు చేదు ఫలితమే ఎదురైంది. ఇంకో వన్డే మిగిలుండగానే టీమిండియా 0–2తో సిరీస్‌ను కోల్పోయింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మెహదీ హసన్‌ మిరాజ్‌ (83 బంతుల్లో 100 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు; 2/46) ఆల్‌రౌండ్‌ ప్రదర్శన ముందు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (28 బంతుల్లో 51 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్స్‌) ఆశలు రేపిన మెరుపులు చిన్నబోయాయి. దీంతో భారత్‌ 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడింది.

మొదట బంగ్లా 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది. మహ్ముదుల్లా (96 బంతు ల్లో 77; 7 ఫోర్లు) రాణించాడు. అనంతరం టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులే చేసి ఓడింది. శ్రేయస్‌ అయ్యర్‌ (82; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (56; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే శనివారం జరుగుతుంది. 

రోహిత్‌ చెత్త రికార్డు
ఈ పరాజయం నేపథ్యంలో రోహిత్‌ ఇన్నింగ్స్‌ వృథాగా పోవడమే గాకుండా... కెప్టెన్‌గా ఓ చెత్త రికార్డును కూడా అతడు మూటగట్టుకున్నాడు. బంగ్లా గడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి వన్డే సిరీస్‌ను సమర్పించుకున్న రెండో భారత సారథిగా నిలిచాడు. గతంలో ధోని కెప్టెన్సీలో బంగ్లాలో భారత్‌ సిరీస్‌ ఓడిపోయింది.

రైనాకు సాధ్యమైంది.. కానీ రోహిత్‌కు మాత్రం
కాగా ఇప్పటి వరకు బంగ్లా పర్యటనలో సౌరవ్‌ గంగూలీ(2004), రాహుల్‌ ద్రవిడ్‌(2007), సురేశ్‌ రైనా(2014) సారథ్యంలో టీమిండియా వన్డే సిరీస్‌లు గెలిచింది. ఇక ధోని కెప్టెన్సీలో 2015లో మొదటి రెండు మ్యాచ్‌లు ఓడినా ఆఖరి వన్డేలో గెలిచి పరువు దక్కించుకుంది.

అయితే, ఈసారి రోహిత్‌ శర్మ, దీపక్‌ చహర్‌, కుల్దీప్‌ సేన్‌ ఆఖరి వన్డేకు అందుబాటులో ఉండటం లేదు. రోహిత్‌, చహర్‌ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బే. మరి శనివారం నాటి చివరి వన్డే ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి!

చదవండి: Ind VS BAN: వారెవ్వా! రోహిత్‌ అరుదైన రికార్డ్‌.. ప్రపంచ క్రికెట్‌లో రెండో ఆటగాడిగా..
IND vs BAN: రోహిత్‌ భయ్యా నీ ఇన్నింగ్స్‌కు హ్యాట్సప్‌.. ఓడిపోయినా పర్వాలేదు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top