Ind VS BAN: వారెవ్వా! రోహిత్‌ అరుదైన రికార్డ్‌.. ప్రపంచ క్రికెట్‌లో రెండో ఆటగాడిగా..

Ind VS BAN: Rare record for Rohit Sharma during Bangladesh ODI - Sakshi

ఆఖరు బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ పోరాటం వృధా అయింది. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే బంగ్లాదేశ్‌ 2-0తో కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా.. ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బొటన వేలికి గాయం అయింది. అతడిని ఎక్స్‌-రే కోసం ఆస్పత్రికి తరలించారు. తర్వాత రోహిత్‌ గ్రౌండ్‌లోకి దిగలేదు. 

ఇదిలాఉండగా.. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను టీమిండియా బౌలర్లు తీవ్రంగా దెబ్బతీశారు. ఓ దశలో ఆతిథ్య జట్టు 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో మెహిదీ హసన్‌ (83 బంతుల్లో 100 పరుగులు), మహ్మదుల్లా (77 పరుగులు)  కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. 

భళా రోహిత్‌
272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శ్రేయస్‌ అ‍య్యర్‌ (82), అక్సర్‌ పటేల్‌ (56) కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే వీరివురు వెంటవెంటనే అవుట్‌ కావడంతో భారత్‌ 43 ఓవర్లలో  207/7తో కష్టాల్లో పడింది. అయితే, ఇక్కడే భారత్‌కు మరో అవకాశం లభించినట్టయింది. గాయంతో బ్యాటింగ్‌కు రాడనుకున్న రోహిత్‌ ఎనిమిదో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌గా క్రీజ్‌లోకి వచ్చాడు.

నొప్పిని భరిస్తూ క్రీజులో కుదురుకున్న కెప్టెన్‌.. తర్వాత బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 28 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. ఇందులో 3 బౌండరీలు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే, లక్ష్యం వైపు సాగుతున్న భారత్‌ను సాధించాల్సిన రన్‌రేట్‌ అమాంతం పెరిగిపోయి కలవర పెట్టింది. చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరమవగా.. 14 పరుగులే చేసింది. ఫలితంగా టీమిండియాకు 5 పరుగులతో ఓటమి తప్పలేదు.

అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 సిక్సర్లు బాదిన తొలి భారతీయుడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా రెండో బ్యాటర్‌గా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిలిచాడు. వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌గేల్‌ మాత్రమే 553 సిక్సర్లతో రోహిత్‌ కంటే ముందున్నాడు. ఇక షాహిద్‌ అఫ్రిదీ 476, బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ 398, ఎంఎస్‌ ధోని 359 సిక్సర్లు కొట్టారు.

చదవండి: (భారత్‌పై బంగ్లాదేశ్‌ బ్యాటర్ల సరి కొత్త చరిత్ర.. 17 ఏళ్ల రికార్డు బద్దలు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top