Sanju Samson: ఫిట్‌గా పంత్‌! సంజూకు అసలు జట్టులో చోటే లేదు! రజత్‌పై ఎందుకంత ప్రేమ?

Ind Vs Ban 2022 Simon Doull: Why They Leave Sanju And Taken Rajat - Sakshi

India’s Tour of Bangladesh 2022: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై న్యూజిలాండ్‌ మాజీ బౌలర్‌ సైమన్‌ డౌల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిభావంతుడైన సంజూ శాంసన్‌ను కాదని రజత్‌ పాటిదార్‌ను ఎంపిక చేయడం ఏమిటని ప్రశ్నించాడు. రజత్‌పై ఉన్న ప్రేమ సంజూకు శాపంగా మారిందన్నట్లుగా వ్యాఖ్యానించాడు. 

ఈ కేరళ బ్యాటర్‌ను వాళ్లు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం అంటూ బీసీసీఐ సెలక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. కాగా గత కాలంగా వార్తల్లో నిలుస్తున్న పేరు సంజూ శాంసన్‌. ప్రతిభను నిరూపించుకుంటున్నప్పటికీ అతడికి అదృష్టం కలిసిరావడం లేదు. టీమిండియాలో అడపాదడపా తప్ప పెద్దగా అవకాశాలు రావడం లేదు.

ఐపీఎల్‌లో రాణించాడు...
ఇక ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు సంజూ. అయినప్పటికీ టీ20 ప్రపంచకప్‌-2022 జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఈ మెగా టోర్నీ తర్వాత న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన జట్టుకు ఎంపికైనప్పటికీ టీ20 సిరీస్‌లో తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. 

ఈ టూర్‌కు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన రిషభ్‌ పంత్‌ విఫలమైనప్పటికీ అతడినే టీ20 సహా వన్డే సిరీస్‌లలో కొనసాగించారు. ఇక మొదటి వన్డేలో సంజూ ఆకట్టుకున్పటికీ మిగతా మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరును ఎండగడుతూ సంజూ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్‌ చేశారు.

సంజూను పక్కనపెట్టి.. రజత్‌కు ఎందుకు అవకాశం?
ఇదిలా ఉంటే.. కివీస్‌ టూర్‌ ముగిసిన వెంటనే రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలో టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లింది. ఆతిథ్య జట్టులో వన్డే, టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఇక టూర్‌కు సంజూ శాంసన్‌ను పక్కనపెట్టిన సెలక్టర్లు.. మధ్యప్రదేశ్‌ బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌కు భారత జట్టులో అవకాశం ఇచ్చారు.

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపికైనప్పటికీ అరంగేట్రం చేయలేకపోయిన పాటిదార్‌ ఈసారి మాత్రం తుది జట్టులో ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్‌ జట్టులో కీలక ఆటగాడైన రజత్‌ ఐపీఎల్‌-2022లో ఆర్సీబీ తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో 49 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచి గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు.

పంత్‌ ఫిట్‌గానే ఉన్నాడు! సంజూకు నో ఛాన్స్‌
మరోవైపు.. న్యూజిలాండ్‌తో సిరీస్‌ సందర్భంగా రిషభ్‌ పంత్‌ గాయపడ్డాడని, అతడి స్థానంలో సంజూని తీసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు టెస్టుల్లో కూడా అరంగేట్రం చేయిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, అలా జరుగలేదు.

సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ గాయపడ్డ కారణంగా అతడి స్థానంలో యువ ఫాస్ట్‌బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ శనివారం వెల్లడించింది. ఆదివారం (డిసెంబరు 4) తొలి వన్డే ఆరంభం నేపథ్యంలో ఈ మేరకు అప్‌డేట్‌ ఇచ్చింది. కానీ, అంతా ఊహించినట్లుగా సంజూకు జట్టులో స్థానం దక్కలేదు. పంత్‌ ఫిట్‌గా ఉన్నట్లు శనివారం నాటి ప్రకటనతో అర్థమైంది. దీంతో సంజూ ఫ్యాన్స్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

రజత్‌పై ప్రేమ ఉంటే తప్పులేదు.. కానీ
ఈ నేపథ్యంలో కివీస్‌ మాజీ ప్లేయర్‌ సైమన్‌ డౌల్‌ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ సంజూ గురించి ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు.. ‘‘వాళ్లకి రజత్‌ పాటిదార్‌ మీద ఎంతో ప్రేమ ఉందని నాకు తెలుసు. అతడిని వాళ్లు ఇష్టపడటంలోనూ తప్పులేదు.

అయితే, భారత జట్టులో చాలా మంది బ్యాటర్లు ఉన్నారు. ముఖ్యంగా సంజూ శాంసన్‌ వంటి మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ ఈసారి అతడిని కాదని వాళ్లు రజత్‌ పాటిదార్‌ను ఎందుకు తీసుకున్నట్లు? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు’’ అని ఈ మాజీ పేసర్‌ పేర్కొన్నాడు.

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్‌), కెఎల్ రాహుల్ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ , మహ్మద్‌ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.

చదవండి: Pak Vs Eng 1st Test: ఇంగ్లండ్‌కు ధీటుగా బదులిస్తున్న పాక్‌.. వాళ్లు 4 శతకాలు బాదితే, వీళ్లు 3 కొట్టారు
Shikhar Dhawan: పంత్‌కు అండగా నిలబడాలి... సంజూ ఇంకొంత కాలం ఆగాల్సిందే.. ఎందుకంటే!

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top