ఫైనల్లో అలా ఎందుకు చేశారు.. అతడికి బదులు: గంభీర్‌ విమర్శలు | If You Not Confident Of Him Could Picked Someone Else: Gautam Gambhir, Wasim Akram On Rohit Crucial Move - Sakshi
Sakshi News home page

CWC 2023 Final: అలా ఎందుకు చేశారు.. అతడికి బదులు: గంభీర్‌, అక్రం విమర్శలు

Published Tue, Nov 21 2023 5:49 PM

If You Not Confident of Him Could Picked Someone else: Gambhir Akram On Rohit Move - Sakshi

CWC 2023 Final Ind Vs Aus Winner Australia: వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లీగ్‌ దశ నుంచి సెమీస్‌ వరకు అజేయంగా నిలిచిన రోహిత్‌ సేన తుదిమెట్టుపై బోల్తా పడటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రపంచకప్‌ టోర్నీ ముగిసి రెండురోజులు అవుతున్నా క్రీడా వర్గాల్లో ఈ మ్యాచ్‌ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్‌ గౌతం గంభీర్‌, పాకిస్తాన్‌ దిగ్గజ బౌలర్‌ వసీం అక్రం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా అహ్మదాబాద్‌ వేదికగా ప్రపంచకప్‌-2023 ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

ఆరోసారి జగజ్జేతగా
నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 240 పరుగులకు ఆలౌట్‌ అయింది. రోహిత్‌ సేన విధించిన ఈ లక్ష్యాన్ని ఆసీస్‌ 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది.

ఇదిలా ఉంటే.. ఫైనల్‌ సందర్భంగా టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చర్చలకు తావిచ్చాయి. సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆరో స్థానంలో గాకుండా ఏడో నంబర్లో ఆడించడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అలా ఎందుకు చేశారు?
ఈ విషయంపై తాజాగా స్పందించిన గంభీర్‌.. ‘‘నిజం చెప్తున్నా.. సూర్యకుమార్‌ కుమార్‌ విషయంలో అలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. ఏదేమైనా అతడిని ఏడో నంబర్‌కు డిమోట్‌ చేయడం సరైన నిర్ణయం కాదు. విరాట్‌ అవుటైన తర్వాత కేఎల్‌ రాహుల్‌ మంచిగా బ్యాటింగ్‌ చేస్తున్నపుడు.. అతడికి తోడుగా సూర్యను పంపించి.. దూకుడుగా ఆడమని చెప్పాల్సింది.

ఎందుకంటే అతడి తర్వాత జడేజా ఉంటాడు కాబట్టి సూర్య కూడా కాస్త స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసేవాడు. కానీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య బాగా ఇబ్బంది పడ్డాడు. ‘‘నేను అవుటైతే.. నా తర్వాత జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌షమీ, కుల్దీప్‌ యాదవ్‌ మాత్రమే ఉన్నారు’’ అనే మైండ్‌సెట్‌తో మరీ డిఫెన్సివ్‌గా ఆడాడు.

సమర్థించిన వసీం 
ఒకవేళ తన తర్వాత జడేజా వస్తాడంటే సూర్య తన సహజమైన గేమ్‌ ఆడేవాడు. సూర్యకు ప్యూర్‌ బ్యాటర్‌గా జట్టులో చోటిచ్చి ఏడో నంబర్‌లో పంపే బదులు.. అతడికి బదులు వేరే వాళ్లను ఎంపిక చేయాల్సింది’’ అని స్పోర్ట్స్‌కీడా షోలో అభిప్రాయపడ్డాడు.

ఇక వసీం అక్రం కూడా గంభీర్‌ వాదనను సమర్థిస్తూ.. ‘‘అవును.. అతడు ప్యూర్‌ బ్యాటర్‌. ఒకవేళ హార్దిక్‌ జట్టులో ఉన్నపుడు కేవలం కొన్ని ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయనకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా పర్లేదనిపిస్తుంది. కానీ అప్పటికి చాలా ఓవర్లు మిగిలే ఉన్నాయి కదా!’’ అని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.

చదవండి: వరల్డ్‌కప్‌లో ఘోర పరాభవం.. పాక్‌ బోర్డు మరో కీలక నిర్ణయం

Advertisement
Advertisement