ICC ODI WC 2023 Ind Vs Pak: హైదరాబాద్‌లో టీమిండియా-పాక్‌ మ్యాచ్‌!

ICC ODI WC 2023: India-Pakistan Match-October-15th May-Held-Hyderabad - Sakshi

ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో దాయాది పాకిస్తాన్‌ తన మ్యాచ్‌లన్నీ హైదరాబాద్‌, చెన్నైలో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నప్పటికి.. పాక్‌ మాత్రం హైదరాబాద్‌లో టీమిండియాతో మ్యాచ్‌ ఆడితే బాగుంటుందని ఆలోచిస్తోంది. 

అయితే  టోర్నీ నిర్వహణకు ఐసీసీ క్లియరెన్స్‌ ఇచ్చినప్పటికి బీసీసీఐ వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయాల్సి ఉంది. బహుశా ఐపీఎల్‌ తర్వాత షెడ్యూల్‌ను అనౌన్స్‌ చేసే అవకాశం ఉంది. ఇక ఐసీసీ అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు వన్డే ప్రపంచకప్‌ జరుగుతుందని ప్రకటించింది. 

క్రిక్‌బజ్‌ సమాచార మేరకు అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 5న ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో  మెగాటోర్నీ ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఇక టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోనే నిర్వహిస్తే బాగుంటుందని ఐసీసీ అభిప్రాయపడింది.

ఇక దాయాది పాకిస్థాన్తో టీమిండియా ఆడే మ్యాచ్‌ అక్టోబర్ 15న జరిగే అవకాశం ఉన్నట్లు రిపోర్టు తెలిపింది. వరల్డ్ కప్ లో ఆడటానికి పాకిస్థాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇండియాతో మ్యాచ్ ను అహ్మదాబాద్ లో నిర్వహించడంపైనే పాక్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

రిపోర్టు ప్రకారం పాకిస్థాన్ హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరులలో ఆడాల్సి ఉన్నప్పటికి అహ్మదాబాద్‌, బెంగళూరులో ఆడేందుకు పాక్‌ ఇష్టపడడం లేదని తెలిసింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌(టీమిండియా-పాకిస్తాన్) హైదరాబాద్‌లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈసారి వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌ కోల్‌కతా, ఢిల్లీ, ఇండోర్, ధర్మశాల, గువాహటి, రాజ్‌కోట్, రాయ్‌పూర్, ముంబైలలోనూ వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రతి టీమ్ 9 లీగ్ మ్యాచ్ లు ఆడనుండటంతో.. దాదాపు ప్రతి సిటీలో ఇండియా మ్యాచ్ లు ఉండనున్నాయి. వరల్డ్ కప్ లో మొత్తం 10 జట్లు ఆడనుండగా.. 48 మ్యాచ్ లు జరుగుతాయి.

చదవండి: 'మ్యాచ్‌ గెలిచాం కదా.. ఆ సెలబ్రేషన్‌ అవసరమా?'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top