బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మొండి వైఖరి కారణంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండుసార్లు అవకాశం ఇచ్చినా తీరు మార్చుకోని కారణంగా.. బంగ్లా జట్టును టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి తప్పించారు.
ఆటగాళ్లతో పాటు వారికీ సెగ
బంగ్లాదేశ్ ప్రభుత్వం, బీసీబీ నిర్ణయాల కారణంగా ప్రపంచకప్ ఆడాలన్న ఆటగాళ్ల కల ఈసారికి దూరమైంది. అంతేకాదు.. ఆ సెగ బంగ్లాదేశ్ జర్నలిస్టులకు కూడా తగిలినట్లు తెలుస్తోంది. భారత్- శ్రీలంక (India- Sri Lanka)వేదికలుగా జరిగే వరల్డ్‌కప్ టోర్నీ కవరేజ్ కోసం వంద మందికి పైగా జర్నలిస్టులు అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
అయితే, ఐసీసీ మాత్రం వీరి దరఖాస్తులు, అభ్యర్థనలను తిరస్కరించినట్లు (Were Denied visa and Accreditation) సమాచారం. దీంతో ఈసారి బంగ్లా జర్నలిస్టులు ఈ టోర్నీని ప్రత్యక్షంగా కవర్ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయం గురించి ఆజ్‌కర్ ప్రతిక స్పోర్ట్స్ ఎడిటర్ రానా అబ్బాస్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.
చాలా బాధగా ఉంది
‘‘బంగ్లాదేశ్‌లో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఘటన జరుగలేదు. 1999లో బంగ్లా జట్టు తొలిసారి ప్రపంచకప్ ఆడేకంటే ముందు నుంచే బంగ్లాదేశీ జర్నలిస్టులు ఈ ఈవెంట్‌ను కవర్ చేస్తున్నారు. భారత్- పాకిస్తాన్ వంటి కీలక మ్యాచ్‌లు.. ముఖ్యంగా భారత్‌లో జరిగిన మ్యాచ్‌లను కూడా కవర్ చేశారు.
గతంలో ఎప్పుడూ ఇలా అందరు కరస్పాండెంట్‌ల దరఖాస్తులను తిరస్కరించిన దాఖలాలు లేవు. ఇదొక దురదృష్టకర ఘటన. నాకైతే చాలా బాధగా ఉంది’’ అని రానా అబ్బాస్ విచారం వ్యక్తం చేశాడు.
దెబ్బ అదుర్స్ కదూ!
ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ ఐసీసీ అధికారి స్పందన కోరగా.. బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ‘‘భారత్‌లో తమ వాళ్లకు రక్షణ ఉండదని బంగ్లాదేశ్ ప్రభుత్వం పదే పదే వాదించింది. అందుకే వాళ్లకు వీసాలు, అక్రిడేషన్లు ఇవ్వలేదు’’ అంటూ ఇచ్చిపడేశారు సదరు అధికారి.
చెప్పినా వినలేదు
కాగా తమ ఆటగాళ్లకు భారత్ సురక్షితం కాదని.. వేదికను శ్రీలంకకు మార్చాలంటూ బీసీబీ.. ఐసీసీని ఆశ్రయించింది. అయితే, పరిశీలనా బృందం నివేదిక మేరకు భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని తేల్చింది ఐసీసీ. అయితే, బీసీబీ మాత్రం పట్టువీడలేదు. వేదిక మార్చకుంటే టోర్నీ నుంచి వైదొలుగుతామని బెదిరించింది.
ఈ నేపథ్యంలో ఆఖరి అవకాశం ఇచ్చినా బీసీబీ తీరు మారకపోవడంతో.. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించింది ఐసీసీ. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చించింది. తాజాగా బీసీబీ చెప్పిన సాకునే కారణంగా చూపుతూ జర్నలిస్టులకు వీసాలు నిరాకరించినట్లు సమాచారం.
చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్!


