హైదరాబాద్‌ పరాజయం | Hyderabad team defeated in the Ranji Trophy | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ పరాజయం

Jan 26 2026 3:01 AM | Updated on Jan 26 2026 3:01 AM

Hyderabad team defeated in the Ranji Trophy

నాకౌట్‌ దశకు ముంబై అర్హత

సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్‌ జట్టు మరో పరాజయం మూటగట్టుకుంది. ఆదివారం గ్రూప్‌ ‘డి’లో భాగంగా ఉప్పల్‌ వేదికగా ముగిసిన పోరులో హైదరాబాద్‌ జట్టు 9 వికెట్ల తేడాతో 42 సార్లు చాంపియన్‌ ముంబై చేతిలో ఓడింది. ఈ విజయంతో బోనస్‌ పాయింట్‌ ఖాతాలో వేసుకున్న ముంబై జట్టు 30 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 

ఓవర్‌నైట్‌ స్కోరు 166/7తో ఆదివారం నాలుగోరోజు ‘ఫాలోఆన్‌’ కొనసాగించిన హైదరాబాద్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 69.5 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌటైంది. సీవీ మిలింద్‌ (128 బంతుల్లో 85; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడగా... అతడికి నితిన్‌ సాయి యాదవ్‌ (32; 6 ఫోర్లు), కెప్టెన్‌ సిరాజ్‌ (32; 5 ఫోర్లు, 1 సిక్స్‌) సహకారం అందించారు. ముంబై బౌలర్లలో ముషీర్‌ ఖాన్‌ 5 వికెట్లు... మోహిత్‌ 3 వికెట్లు పడగొట్టారు. 

అనంతరం 10 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ముంబై జట్టు 3.2 ఓవర్లలో 1 వికెట్‌ కోల్పోయి 12 పరుగులు చేసి గెలిచింది. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 560 పరుగులు చేయగా... హైదరాబాద్‌ 267 పరుగులకు పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

గ్రూప్‌ దశలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒక విజయం, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 13 పాయింట్లు సాధించిన హైదరాబాద్‌ జట్టు గ్రూప్‌లో ఐదో స్థానంలో ఉంది. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో గురువారం నుంచి ఛత్తీస్‌గఢ్‌తోహైదరాబాద్‌ తలపడనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement