
డిజిటల్ వీక్షణకు సంబంధించి టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. భారత్, ఇంగ్లండ్ మధ్య టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025లో భాగంగా జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌ను (చివరి రోజు ఓ దశలో) ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం JioHotstar ద్వారా రికార్డు స్థాయిలో 13 మిలియన్ మంది వీక్షించారు.
డిజిటల్ వీక్షణలో ఇది ఆల్‌టైమ్ రికార్డు. గతంలో ఏ టెస్ట్ మ్యాచ్‌కు ఒకేసారి ఇంత వ్యూయర్‌షిప్ దక్కలేదు. ఈ మ్యాచ్ డిజిటల్ వ్యూయర్‌షిప్ రికార్డులను తిరగరాసింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్‌ను 6 పరుగుల స్వల్ప తేడాతో ఓడించి 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది.
చివరి రోజు (ఆగస్ట్ 4) ఇంగ్లండ్ గెలుపుకు 35 పరుగులు అవసరమైన దశలో (చేతిలో 4 వికెట్లు ఉండగా) భారత పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుతం చేశాడు. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి (3 వికెట్లు తీసి) టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
రికార్డులు బద్దలు
టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025లో ఒక్కో మ్యాచ్ ఒక్కో ప్రత్యేక అనుభూతిని మిగిల్చింది. ఈ సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లు చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగాయి. టెస్ట్ క్రికెట్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. దీన్ని బట్టి చూస్తే భారత్, ఇంగ్లండ్ మధ్య పోటీ ఏ రేంజ్‌లో సాగిందో ఇట్టే అర్దమవుతుంది.
నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ సిరీస్‌ను విశ్వవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వేర్వేరు మాధ్యమాల ద్వారా రికార్డు స్థాయిలో వీక్షించారు. డిజిటల్‌కు సంబంధించి ఈ సిరీస్ ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సిరీస్‌ను జియో హాట్‌స్టార్ ద్వారా 170 మిలియన్లకు పైగా వీక్షించారు.
డిజిటల్ ప్లాట్‌ఫాం చరిత్రలో ఏ టెస్ట్ సిరీస్‌ను ఇంత మంది వీక్షించలేదు. డిజిటల్‌లో అత్యధిక రీచ్‌ను దక్కించుకున్న సిరీస్‌గా టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025 చరిత్రలో నిలిచిపోతుంది.