
టీమిండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్ (Sai Sudharsan)పై భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ (Navjot Singh Sidhu) సిద్ధు ప్రశంసల వర్షం కురిపించాడు. భారత టెస్టు జట్టులో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు అతడే సరైనోడని కొనియాడాడు. సాయి టెక్నిక్ అద్భుతమని.. జట్టులో స్థానం కోసం జరిగే రేసులో అతడే ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటాడని పేర్కొన్నాడు.
అత్యధిక పరుగుల వీరుడు
కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో గుజరాత్ టైటాన్స్ తరఫున అదరగొట్టాడు సాయి సుదర్శన్. మొత్తంగా 15 మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 759 పరుగులు సాధించి.. అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇక టీమిండియా తరఫున ఇప్పటికే వన్డే, టీ20లలో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు.
సాయిపై వేటు వేసి..
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్.. మూడో స్థానంలో వచ్చి డకౌట్ అయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 30 పరుగుల చేయగలిగాడు. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్ అతడిని వేటు వేసి.. వన్‌డౌన్‌లో కరుణ్ నాయర్‌ను ఆడించింది.
అర్ధ శతకంతో సత్తా చాటి
అయితే, ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్ టెస్టుల్లో కరుణ్ విఫలం కావడంతో.. మాంచెస్టర్‌లో బుధవారం మొదలైన నాలుగో టెస్టు సందర్భంగా సాయికి మళ్లీ అవకాశం వచ్చింది. ఈ క్రమంలో మరోసారి వన్‌డౌన్‌లో వచ్చిన సాయి అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 151 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 61 పరుగులు సాధించాడు.
సరైనోడు వచ్చాడు
ఈ నేపథ్యంలో నవజ్యోత్ సింగ్ సిద్ధు 23 ఏళ్ల సాయి సుదర్శన్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు. ‘‘ఛతేశ్వర్ పుజారా స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో వన్‌డౌన్‌లో ఎంతో మంది ఆటగాళ్లను పరిశీలించారు. ఇక ఇప్పుడు ఆ అవసరం లేదు.
పోటీపడే వారికి చుక్కలే
టెస్టు క్రికెట్‌కు ఐపీఎల్ ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకోలేము. కానీ.. టెక్నిక్‌పరంగా చూస్తే అతడు సరైన బ్యాటర్. జట్టులో స్థానం కోసం పోటీపడుతున్న ఆటగాళ్లకు అతడు నిద్రలేని రాత్రులు మిగల్చడం ఖాయం.
సాయి సుదర్శన్ ఆటను చూసినప్పటి నుంచి నేను ఇదే మాట చెబుతున్నా. వన్‌డౌన్ బ్యాటర్‌గా అతడు జట్టులో పాతుకుపోతాడు’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు అభిప్రాయపడ్డాడు. సాయి సుదర్శన్ బ్యాటింగ్‌లో ఎలాంటి బలహీనతా కనిపించడం లేదని.. అదే అతడికి ఉన్న అతిపెద్ద బలం అని కొనియాడాడు.
మెరుగ్గానే..
కాగా ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ టెస్టులో బుధవారం నాటి తొలి రోజు ఆటలో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. 83 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్‌లో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా జయభేరి మోగించింది.
అయితే, లార్డ్స్ టెస్టులో ఇరుజట్ల మధ్య ఊగిసలాడిన విజయం ఆఖరికి ఆతిథ్య జట్టును వరించింది. దీంతో ఇంగ్లండ్ 2-1తో ముందంజలో ఉంది. మాంచెస్టర్‌లో గెలిస్తేనే గిల్ సేనకు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.
చదవండి: IND vs ENG: టీమిండియా కెప్టెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. వరల్డ్ రికార్డు బద్దలు