
భారత అండర్-19 కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం ఆయుష్ మాత్రే ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు. యూత్ టెస్ట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా మాత్రే నిలిచాడు. చెమ్స్‌ఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రే ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
వన్డే తరహాలో కేవలం 64 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 80 బంతులు ఎదుర్కొన్న మాత్రే.. 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 126 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్ బెల్ పేరిట ఉంది. అతడు 2022లో శ్రీలంక అండర్-19 టీమ్‌పై 88 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్‌తో బెల్ అల్‌టైమ్ రికార్డును మాత్రే బ్రేక్ చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో యూత్ టెస్టు డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ జట్టు ఆఖరి రోజు ఆటలో భారత్ ముందు 355 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. ఈ లక్ష్య చేధనలో భారత్ ఆరంభంలోనే వైభవ్ సూర్యవంశీ(0) వికెట్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో ఆయూష్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుండు(65)తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే భారత విజయానికి 65 పరుగులు కావాల్సిన సమయంలో వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌ను అంపైర్‌లు డ్రా ముగించారు.
టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లు ఎదుర్కొని 6 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కూడా మాత్రే 80 పరుగులతో రాణించాడు. తొలి యూత్ టెస్టులో కూడా మాత్రే సెంచరీతో మెరిశాడు. కాగా రెండు యూత్ టెస్టులు కూడా డ్రాగానే ముగిశాయి. వన్డే సిరీస్ మాత్రం భారత్ 3-2తో సొంతం చేసుకుంది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు