
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభంలో వరుస విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిట.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అక్షర్ సేన.. ఆరింట గెలిచి.. నాలుగు ఓడిపోయింది.
ఐదో స్థానంలో
ఇక చివరగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో వెనుకబడ్డ ఢిల్లీ.. అదృష్టవశాత్తూ వర్షం వల్ల గట్టెక్కింది. ఉప్పల్‌లో వాన తెరిపినిచ్చినా ఆట సాగేందుకు వీలు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ రాగా.. ఢిల్లీ ఖాతాలో ఓవరాల్‌గా 13 పాయింట్లు చేరాయి.
తద్వారా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత.. ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం మరో కీలక పోరుకు ఢిల్లీ సిద్ధమైంది.
పటిష్ట పంజాబ్ కింగ్స్ (PBKS vs DC)తో ధర్మశాల వేదికగా తలపడనుంది. ఇందులో గెలిస్తేనే ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సులభతరంగా మారతాయి. లేదంటే.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంతటి కీలక మ్యాచ్‌కు ముందు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఢిల్లీ యాజమాన్యానికి కీలక సూచన చేశాడు.
కరుణ్, అభిషేక్‌ల కంటే బెటర్
పవర్ హిట్టర్ అశుతోష్ శర్మను తుదిజట్టులోకి తీసుకోవాలని ఆకాశ్ చోప్రా సూచించాడు. ‘‘అశుతోష్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాకుండా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించండి. మీరు తొలుత బ్యాటింగ్ చేసినట్లైతే ఇదే సరైన వ్యూహం.
విప్రాజ్ నిగమ్ తర్వాత అతడిని పంపండి. నిజానికి కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్ కంటే అశుతోష్ మెరుగ్గా, నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి అందరూ అవుటైన తర్వాత కాకుండా ముందే అతడిని బ్యాటింగ్‌కు పంపండి.
మ్యాచ్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుని.. మలుపు తిప్పగల సత్తా అతడికి ఉంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఆర్డర్ ఎందుకు మారుతుందో తనకైతే అర్థం కావడం లేదని ఈ కామెంటేటర్ పేర్కొన్నాడు.
వారి వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు
‘‘ఇప్పటికి దాదాపు ఆరు ఓపెనింగ్ జోడీలను మార్చి ఉంటారు. దీని వెనుక వారి వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు. ఓపెనర్ల విషయంలోనే స్పష్టత లేకపోతే.. ప్లే ఆఫ్స్ చేరడం కూడా కష్టమే అవుతుంది’’ అని ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫినిషర్‌గా అశుతోష్ శర్మ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికి ఎనిమిది ఇన్నింగ్స్ ఆడి 186 పరుగులు చేశాడు. మరోవైపు.. కరుణ్ నాయర్ 7 ఇన్నింగ్స్ ఆడి 154 పరుగులు చేయగా.. అభిషేక్ పోరెల్ 11 ఇన్నింగ్స్‌లో 265 రన్స్ సాధించాడు.
చదవండి: KKR vs CSK: పో.. పో!.. వరుణ్ చక్రవర్తికి షాకిచ్చిన బీసీసీఐ