
Photo Courtesy: BCCI
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy)కి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో మ్యాచ్‌లో అనుచిత ప్రవర్తనకు గానూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడికి మొట్టికాయలు వేసింది. మ్యాచ్ ఫీజులో ఇరవై ఐదు శాతం మేర కోత విధించింది.
అంతేకాదు.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ వరుణ్ చక్రవర్తి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. ఐపీఎల్-2025లో భాగంగా కేకేఆర్ బుధవారం చెన్నైతో తలపడిన విషయం తెలిసిందే.
రహానే రాణించినా
సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (11) విఫలం కాగా.. సునిల్ నరైన్ (26) ఫర్వాలేదనిపించాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ (48) ఆడగా.. మనీశ్ పాండే (36 నాటౌట్), ఆండ్రీ రసెల్ (38) కూడా రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగలిగింది.
చెన్నై బౌలర్లలో స్పిన్నర్లు నూర్ అహ్మద్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. పేసర్ అన్షుల్ కాంబోజ్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు
ఇక కేకేఆర్ విధించే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై ఆదిలోనే ఓపెనర్లు ఆయుశ్ మాత్రే, డెవాన్ కాన్వే డకౌట్ కావడంతో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ 31 పరుగులతో రాణించగా.. ఆరో స్థానంలో వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ దంచికొట్టాడు.
కేవలం 25 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసిన బ్రెవిస్.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. అయితే, హాఫ్ సెంచరీతో జోరు మీదున్న ఈ సౌతాఫ్రికా చిచ్చర పిడుగును కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు.
వరుణ్ రౌండ్ ది వికెట్ బౌల్ చేయగా.. బ్రెవిస్ ముందుకు వచ్చి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో లాంగాన్ మీదుగా వెళ్లిన బంతి రింకూ సింగ్ చేతిలో పడటంతో.. బ్రెవిస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అత్యంత కీలకమైన ఈ వికెట్ తీసిన తర్వాత వరుణ్ చక్రవర్తి..‘‘ పో.. పో’’ అంటూ వేలు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.
— Knight Vibe Media (@Kkrmediareels) May 7, 2025
డీమెరిట్ పాయింట్ కూడా
ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి వరున్ చక్రవర్తికి జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం వరుణ్ చక్రవర్తి లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడని.. అందుకే అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు డీమెరిట్ పాయింట్ కూడా జతచేసింది.
ఇక బ్రెవిస్ విధ్వసంతో గెలుపు దిశగా వచ్చిన చెన్నై.. శివం దూబే (45), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(17 నాటౌట్) కారణంగా విజయతీరాలకు చేరింది. కేకేఆర్‌పై రెండు వికెట్ల తేడాతో గెలిచి ఈ సీజన్‌లో మూడో గెలుపు నమోదు చేసింది. మరోవైపు.. ఈ విజయంతో చెన్నైకి వరుస ఓటముల తర్వాత ఊరట లభించగా.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.
చదవండి: అతడికి థాంక్యూ.. అద్భుతంగా ఆడాడు.. ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాతే..: ధోని
Elation for the men in yellow 🥳@ChennaiIPL make it 1⃣-1⃣ against #KKR in the season with a 2⃣ wicket win at Eden Gardens💛
Updates ▶ https://t.co/ydH0hsBFgS #TATAIPL | #KKRvCSK pic.twitter.com/6MTmj6NPMH— IndianPremierLeague (@IPL) May 7, 2025