IPL 2025: చరిత్ర సృష్టించిన ధోని | IPL 2025, KKR VS CSK: Dhoni Becomes The First Wicketkeeper To Complete 200 Dismissals In IPL | Sakshi
Sakshi News home page

IPL 2025: చరిత్ర సృష్టించిన ధోని

May 8 2025 12:48 PM | Updated on May 8 2025 1:16 PM

IPL 2025, KKR VS CSK: Dhoni Becomes The First Wicketkeeper To Complete 200 Dismissals In IPL

Photo Courtesy: BCCI

సీఎస్‌కే స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 200 మందిని ఔట్‌ చేయడంలో భాగమైన తొలి వికెట్‌ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. నిన్న (మే 7) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ క్యాచ్‌, ఓ స్టంపౌట్‌ చేసిన తర్వాత ధోని ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే, రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీల తరఫున 276 మ్యాచ్‌లు ఆడిన ధోని 153 క్యాచ్‌లు, 47 స్టంపింగ్‌లు చేశాడు. 

ధోని తర్వాత దినేశ్‌ కార్తీక్‌ ఐపీఎల్‌లో అత్యధిక​ డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌కీపర్‌గా ఉన్నాడు. డీకే.. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌, ఆర్సీబీ, కేకేఆర్‌, గుజరాత్‌ లయన్స్‌, ముంబై ఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ ఫ్రాంచైజీల తరఫున 236 మ్యాచ్‌లు ఆడి 174 మందిని ఔట్‌ చేయడంలో భాగమయ్యాడు. ఇందులో 137 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు ఉన్నాయి. ధోని, డీకే తర్వాత అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌ కీపర్లలో వృద్దిమాన్‌ సాహా, రిషబ్‌ పంత్‌, రాబిన్‌ ఉతప్ప తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఐపీఎల్‌లో అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌ కీపర్లు..
200 - MS ధోని (CSK/RPS) - 153 క్యాచ్‌లు, 47 స్టంపింగ్‌లు
174 - దినేష్ కార్తీక్ (DD/RCB/KKR/GL/MI/KXIP) - 137 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు
113 - వృద్ధిమాన్ సాహా (GT/SRH/PBKS/CSK/KKR) - 87 క్యాచ్‌లు, 26 స్టంపింగ్‌లు
100 - రిషబ్ పంత్ (DC/LSG) - 76 క్యాచ్‌లు, 24 స్టంపింగ్‌లు
90 - రాబిన్ ఉతప్ప (KKR/CSK/RR/MI/RCB/PWI) - 58 క్యాచ్‌లు, 32 స్టంపింగ్‌లు

ఓవరాల్‌గా కూడా ధోనిదే అగ్రస్థానం
ఓవరాల్‌గా చూసినా పొట్టి క్రికెట్‌లో అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌ కీపర్లలో ధోనినే మొదటి స్థానంలో ఉన్నాడు. యావత్‌ టీ20 ఫార్మాట్‌లో ధోని 316 మందిని ఔట్‌ చేయడంలో భాగమయ్యాడు. ధోని తర్వాత క్వింటన్‌ డికాక్‌ రెండో స్థానంలో ఉన్నాడు. డికాక్‌ తన టీ20 కెరీర్‌లో 307 డిస్మిసల్స్‌లో భాగమయ్యాడు.

నిన్న జరిగిన మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ధోని ఎట్టకేలకు కెప్టెన్‌గా రెండో విజయాన్ని సాధించాడు. ఉ‍త్కంఠగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్‌కేకు ఈ సీజన్‌ల ఇది మూడో గెలుపు. ఈ గెలుపు వల్ల సీఎస్‌కేకు ఒరిగింది ఏమీ లేనప్పటికీ.. కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మాత్రం దెబ్బకొట్టింది. 

ఈ ఓటమితో కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ జట్టు ఇకపై ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కడం అనుమానమే. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 11 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. 

టాప్‌-5లో ఉన్న గుజరాత్‌ (16), ఆర్సీబీ (16), పంజాబ్‌ (15), ముంబై (14), ఢిల్లీ (13) కేకేఆర్‌ కంటే మెరుగైన పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం పోటీ పడుతున్నాయి. ఈ సీజన్‌లో సీఎస్‌కేతో పాటు సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌ పోటీ నుంచి ఇదివరకే నిష్క్రమించాయి. లక్నో (10), కేకేఆర్‌ (11) కూడా నిష్క్రమణ అంచుల్లో ఉన్నాయి.

నిన్నటి మ్యాచ్‌లో ధోని వికెట్‌కీపింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ రాణించి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కీపింగ్‌లో రఘువంశీ, నరైన్‌ను ఔట్‌ చేయడంలో భాగమైన ధోని.. ఛేదనలో కీలక సమయంలో సిక్సర్‌ కొట్టి తన జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ధోని ఎంతో సంయమనంతో బ్యాటింగ్‌ చేసి, చివరి దాకా క్రీజ్‌లో నిలబడ్డాడు. ఫలితంగా సీఎస్‌కే సీజన్‌లో మూడో విజయం నమోదు చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement