
Photo Courtesy: BCCI
కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఖాతాలో భారీ రికార్డు చేరింది. నిన్న (మే 7) సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన వరుణ్.. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (మ్యాచ్‌ల ప్రకారం) 100 వికెట్ల మైలురాయిని తాకిన స్పిన్నర్‌గా అమిత్ మిశ్రా, రషీద్ ఖాన్ సరసన నిలిచాడు. వరుణ్, మిశ్రా, రషీద్ తలో 83 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించారు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల వీరుడు యుజ్వేంద్ర చహల్‌కు 100 వికెట్లు తీసేందుకు 84 మ్యాచ్‌లు అవసరం కాగా.. ఐపీఎల్‌లో నాలుగో అత్యధిక వికెట్ల వీరుడు సునీల్ నరైన్‌కు 86 మ్యాచ్‌లు అవసరమయ్యాయి.
ఓవరాల్‌గా (స్పిన్నర్లు, పేసర్లు కలుపుకుని) ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వరుణ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. వరుణ్, మిశ్రా, రషీద్‌తో పాటు ఆశిష్ నెహ్రా కూడా 83 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా 100 ఐపీఎల్ వికెట్లు తీసిన రికార్డు కగిసో రబాడ పేరిట ఉంది. రబాడ కేవలం 64 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని తాకాడు. రబాడ తర్వాత లసిత్ మలింగ (70 మ్యాచ్‌లు), హర్షల్ పటేల్ (81), భువనేశ్వర్ కుమార్ (81) అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకారు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన బౌలర్లు
కగిసో రబడ - 64 మ్యాచ్‌లు
లసిత్ మలింగ - 70 మ్యాచ్‌లు
హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్ - 81 మ్యాచ్‌లు
వరుణ్ చకరవర్తి, ఆశిష్ నెహ్రా, రషీద్ ఖాన్, అమిత్ మిశ్రా - 83 మ్యాచ్‌లు
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓ మోస్తరు స్కోర్‌ను (180) కాపాడుకునే క్రమంలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు (జడేజా, బ్రెవిస్) తీశాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్‌తో పాటు సునీల్ నరైన్ (4-0-28-0) కూడా రాణించినా కేకేఆర్ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.
ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో వైభవ్ అరోరా ఏకంగా 30 పరుగులు సమర్పించుకుని కేకేఆర్ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. వైభవ్ 3 వికెట్లు తీసినా 3 ఓవర్లలో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. వైభవ్ వేసిన 11వ ఓవర్‌లో డెవాల్డ్ బ్రెవిస్ తాండవం చేశాడు. మూడు సిక్సర్లు, మూడు బౌండరీలు బాది అప్పటిదాకా కేకేఆర్ చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను సీఎస్‌కే వైపు తిప్పాడు. బ్రెవిస్ ఔటయ్యాక శివమ్ దూబే (45), ధోని (17 నాటౌట్) ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి సీఎస్‌కేకు సీజన్‌లో మూడో విజయాన్ని అందించారు.