
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ (Mohammed Shami)పై అతడి మాజీ భార్య హసీన్ జహాన్ (Hasin Jahan) మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేసింది. స్త్రీలోలుడిగా మారిన షమీ.. కన్న కూతురి చదువును అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నాడని ఆరోపించింది. తనకు నచ్చిన మహిళల పిల్లల్ని మాత్రం అంతర్జాతీయ స్థాయి పాఠశాలల్లో చదివించేందుకు భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నాడని ఆరోపణలు చేసింది.
విడిపోయారు
కాగా ఐపీఎల్‌లో చీర్‌లీడర్‌గా ఉన్న హసీన్ జహాన్‌ను ప్రేమించిన షమీ.. 2014లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు 2015లో కుమార్తె ఐరా జన్మించింది. అయితే, ఆ తర్వాత అనూహ్య రీతిలో షమీపై సంచలన ఆరోపణలు చేసింది హసీన్. గృహహింసకు పాల్పడుతున్నాడని.. మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేస్తున్నాడని ఆరోపించింది. ఇతర స్త్రీలతో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని పేర్కొంది.

నెలకు రూ. 4 లక్షలు
ఈ క్రమంలో వీరి పంచాయతీ న్యాయస్థానానికి చేరింది. తనకు, తన కూతురి పోషణకు కలిపి నెలకు రూ. 10 లక్షలు ఇవ్వాలంటూ హసీన్ జహాన్ కోరగా.. కలకత్తా హైకోర్టు ఇటీవల ఈ అంశంపై తీర్పును వెలువరించింది. హసీన్ జహాన్‌కు భరణంగా నెలకు రూ. 4 లక్షలు ఇవ్వాలని షమీని ఆదేశించింది. ఇందులో రూ. 2.5 లక్షలు తమ కుమార్తె కోసం ఖర్చు పెట్టాలని హసీన్‌కు సూచించింది.
కూతురి జీవితాన్ని తానే నాశనం చేయాలని చూశాడు
ఈ నేపథ్యంలో తాజాగా హసీన్ జహాన్ ఓ శుభవార్తను పంచుకుంటూనే.. షమీపై మరోసారి ఆరోపణలు చేసింది. ‘‘నా కూతురికి మంచి స్కూల్‌లో అడ్మిషన్ దొరకవద్దని నా శత్రువులు కుట్రలు చేశారు. అయితే, అల్లా వారికి బుద్ధి చెప్పాడు. నా కూతురికి ఇంటర్నేషనల్ స్కూల్‌లో అడ్మిషన్ దొరికేలా చేశాడు.
నా కూతురి తండ్రి మాత్రం.. ఆమెకు సీటు దొరకుండా ఉండాలని ప్రయత్నాలు చేశాడు. అయినా, తండ్రి దేవుడు కాలేడు కదా!.. బిలియనీర్ అయినప్పటికీ తన కూతురి జీవితాన్ని తానే నాశనం చేయాలని చూశాడు.
ఆడవాళ్ల పిచ్చిలో పడి.. తన కూతురికి కాకుండా.. తనకు ఇష్టమైన మహిళల పిల్లలను పెద్ద పెద్ద స్కూళ్లలో చదివించే ప్రయత్నాలు చేస్తున్నాడు. లక్షలు ఖర్చు పెట్టి వాళ్లను విమానాల్లో.. అదీ బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించేలా చేస్తున్నాడు.

కానీ కూతురి చదువుకి డబ్బు ఇచ్చేందుకు మాత్రం అతడికి మనసు రాదు’’ అంటూ హసీన్ జహాన్ షమీపై ఆరోపణలు గుప్పించింది. కాగా సీనియర్ పేస్ బౌలర్ షమీ ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్నాడు.
చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ బెంగాల్ పేసర్.. ఫిట్‌నెస్ సమస్యల వల్ల ఇటీవల ఇంగ్లండ్- భారత్ టెస్టు సిరీస్ ఆడలేకపోయాడు. తదుపరి దులిప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున షమీ బరిలోకి దిగే అవకాశం ఉంది.