
చెన్నై: భారత చదరంగంలో మరో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) అవతరించాడు. తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల హరికృష్ణన్ ఈ ఘనత సాధించాడు. ఫ్రాన్స్‌లో ముగిసిన లా ప్లాగ్ని అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్‌లో హరికృష్ణన్ జీఎం హోదా పొందడానికి అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను ఖరారు చేసుకున్నాడు. భారత్‌కే చెందిన ఇనియన్‌తో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణన్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో చివరి జీఎం నార్మ్‌ను అందుకున్నాడు.
2023లో బీల్ చెస్ ఫెస్టివల్‌లో తొలి జీఎం నార్మ్ పొందిన ఈ మాస్టర్ ఆఫ్ కామర్స్ (ఎంకామ్) విద్యార్థి ఈ ఏడాది జూన్‌లో స్పెయిన్‌లో జరిగిన అందుజార్ ఓపెన్‌లో రెండో జీఎం నార్మ్ పొందాడు. ‘చాలా ఆనందంగా ఉంది. ఏడేళ్ల క్రితం గ్రాండ్‌మాస్టర్ హోదా కోసం ప్రయత్నం మొదలైంది. గత మూడేళ్లలో క్రమం తప్పకుండా టోర్నీల్లో పోటీపడుతున్నాను. కానీ జీఎం నార్మ్‌లు సాధించలేకపోయాను.
అయితే రెండు నెలల వ్యవధిలో రెండు జీఎం నార్మ్‌లు పొంది గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నాను’ అని తమిళనాడుకే చెందిన గ్రాండ్‌మాస్టర్ శ్యాం సుందర్ మోహన్‌రాజ్ వద్ద శిక్షణ తీసుకుంటున్న హరికృష్ణన్ వ్యాఖ్యానించాడు.