కార్ల్‌సన్‌కు గుకేశ్‌ షాక్‌ | Gukesh Defeats Magnus Carlsen in Norway Chess 2025 | Sakshi
Sakshi News home page

కార్ల్‌సన్‌కు గుకేశ్‌ షాక్‌

Jun 3 2025 2:57 AM | Updated on Jun 3 2025 2:57 AM

Gukesh Defeats Magnus Carlsen in Norway Chess 2025

క్లాసికల్‌ ఫార్మాట్‌లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌పై నెగ్గిన భారత గ్రాండ్‌మాస్టర్‌  

స్టావెంజర్‌: మాగ్నస్‌ కార్ల్‌సన్‌... చెస్‌ గురించి తెలిసిన వారికి, క్రీడాభిమానులకూ సుపరిచితమైన పేరు... ప్రపంచ చదరంగంలో అతను 14 ఏళ్లుగా వరల్డ్‌ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు ... క్లాసికల్‌ ఫార్మాట్‌లో ఐదుసార్లు... ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో ఐదుసార్లు... బ్లిట్జ్‌ ఫార్మాట్‌లో ఏకంగా ఎనిమిదిసార్లు విశ్వవిజేతగా నిలిచాడు. ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా ఓటమి అంచుల్లో నుంచి విజయాన్ని అందుకోవడంలో దిట్ట. ఇలాంటి అసాధారణ నైపుణ్యమున్న ప్లేయర్‌తో గేమ్‌ ఆడుతూ ‘డ్రా’ చేసుకుంటే అది విజయంతో సమానం. ఇక నేరుగా గెలిస్తే అది పెద్ద సంచలనమే అవుతుంది.

అలాంటి సంచలనమే నమోదు చేశాడు భారత యువ గ్రాండ్‌మాస్టర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌. ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న నార్వే ఓపెన్‌ టోర్నిలో కార్ల్‌సన్‌పై గుకేశ్‌ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... తన కెరీర్‌లో తొలిసారి క్లాసికల్‌ గేమ్‌లో కార్ల్‌సన్‌పై గెలిచాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఆరో రౌండ్‌ గేమ్‌లో 19 ఏళ్ల గుకేశ్‌ తెల్ల పావులతో ఆడుతూ 62 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ ఆట కట్టించాడు.

నాలుగు గంటలపాటు జరిగిన ఈ గేమ్‌లో కార్ల్‌సన్‌ 52వ ఎత్తులో చేసిన తప్పిదాన్ని గుకేశ్‌ అనుకూలంగా మల్చుకొని సంచలన ఫలితం సాధించాడు. తనను ‘ఢీ’కొట్టే సరైన ప్రత్యర్థులు లేకపోవడంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌పై ఆసక్తి కోల్పోయి కొన్నాళ్లుగా ఆ మెగా ఈవెంట్‌కు దూరంగా ఉంటున్న 34 ఏళ్ల కార్ల్‌సన్‌కు... భవిష్యత్‌లో గట్టి ప్రత్యర్థి కాగల సత్తా తనలో ఉందని గుకేశ్‌ నిరూపించుకున్నాడు.  

అసహనంతో... 
గుకేశ్‌ చేతిలో తొలిసారి ఓటమి చవిచూసిన కార్ల్‌సన్‌ పరాజయ భారాన్ని తట్టుకోలేకపోయాడు. ఊహించనిరీతిలో స్పందించాడు. తన నుంచి జరిగిన ఒక్క తప్పిదాన్ని అనుకూలంగా మల్చుకొని గుకేశ్‌ గెలుపు బాట పట్టడంతో కార్ల్‌సన్‌ ఆ కోపాన్నంతా తాము ఆడిన చెస్‌ బోర్డు టేబుల్‌పై చూపించాడు. తన పిడికిలితో ఒక్కసారిగా టేబుల్‌పై కార్ల్‌సన్‌ గట్టిగా కొట్టాడు. ఆ వెంటనే తమాయించుకున్న కార్ల్‌సన్‌ పావులను చెస్‌ బోర్డుపై అమర్చి... గుకేశ్‌కు వద్దకు వెళ్లి రెండుసార్లు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కార్ల్‌సన్‌ను ఓడించిన తర్వాత గుకేశ్‌ కొన్ని క్షణాలపాటు షాక్‌లో ఉండిపోయి ఆ తర్వాత ఈ విజయాన్ని ఆస్వాదించాడు. ఆరో రౌండ్‌ తర్వాత గుకేశ్‌ 8.5 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు.    

Advertisement
 
Advertisement
Advertisement