భారత మహిళా గోల్ఫర్‌కు స్వర్ణం
బధిరుల ఒలింపిక్స్ క్రీడలు
టోక్యో: భారత బధిర క్రీడాకారిణి దీక్షా డాగర్ డెఫిలింపిక్స్‌లో టైటిల్ నిలబెట్టుకుంది. బధిరుల విశ్వక్రీడల్లో గురువారం జరిగిన మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే గోల్ఫ్ ఫైనల్లో ఆమె వరుసగా 68, 65, 72 స్కోర్లతో విజేతగా నిలిచింది. ఫైనల్లో మొత్తం 21 మంది తలపడగా భారత ప్లేయరే అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా 24 ఏళ్ల దీక్ష వరుస డెఫిలింపిక్స్‌ల్లో విజేతగా నిలిచిన గోల్ఫర్‌గా ఘనతకెక్కింది.
నాలుగేళ్ల క్రితం 2021లో జరిగిన బధిర విశ్వక్రీడల్లోనూ ఆమె బంగారు పతకంతో మెరిసింది. అంతక్రితం 2017లో జరిగిన క్రీడల్లో ఆమె రజతం గెలుచుకుంది. పాల్గొన్న ప్రతి మెగా ఈవెంట్‌లోనూ ఆమె పతకంతోనే తిరిగొచ్చింది. జకార్తాలో 2018లో జరిగిన రెగ్యులర్ ఆసియా క్రీడల్లోనూ ఆమె పోటీ పడింది.
ఆ మరుసటి ఏడాది (2019) మహిళల యూరోపియన్ టూర్‌లో 18 ఏళ్ల వయసులో టైటిల్ గెలిచింది. అదితి అశోక్ తర్వాత ఈ టైటిల్ గెలిచిన రెండో భారత గోల్ఫర్‌గా ఘనత వహించింది. ఈ పోటీల్లో భారత్ తరఫున ఆమెతో పాటు హర్‡్ష సింగ్, విభు త్యాగిలు కూడా పోటీపడినప్పటికీ వీళ్లిద్దరు వరుసగా 12వ, 14వ స్థానాలతో సరిపెట్టుకున్నారు.
మాహిత్ ‘ట్రిపుల్ ధమాకా’
భారత రైఫిల్ షూటర్ మాహిత్ సంధూ డెఫిలింపిక్స్‌లో ట్రిపుల్ ధమాకా సాధించింది. 50 మీటర్ల ప్రోన్ ఈవెంట్‌లో ఆమె 246.1 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఆమె 619.7 స్కోరుతో కొత్త ప్రపంచ రికార్డు లిఖించింది.
ఈ మెగా ఈవెంట్‌లో మాహిత్ 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం, 10 మీటర్ల వ్యక్తిగత విభాగంలో రజతం నెగ్గింది. ఆమె మూడు పతకాలతో ఒక్క షూటింగ్ క్రీడాంశంలోనే భారత్ డజను పతకాలను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 12 పతకాలతో ఆరో స్థానంలో ఉంది.


