
శ్రీకృష్ణుడూదేవుడే! పరమశివుడూ దేవుడే! ఇద్దరూ ఘటనాఘటన సమర్థులే! హరిహరులకు భేదం లేదు. ఎవరి ఇష్ట దైవాన్ని వారు పూజించుకుంటూ ఉంటారు. అయితే భక్తులకు వరాలివ్వ గల కృష్ణ పరమాత్మ తానే వరం కోరి శివుని గురించి ఉగ్ర తపస్సు చేయటం విశేషం.
కృష్ణుని అష్ట మహిషులలో రుక్మిణి మొదలైన వారికి ప్రద్యుమ్నాదులు జన్మించారు. కానీ, జాంబవతికిసంతానం కలగలేదు. ఆమె దీనంగా కృష్ణుని ప్రార్థిస్తే, కృష్ణుడు పుత్రుని కోసం ఆరునెలలు పాశుపత దీక్షను స్వీకరించి, తీవ్ర తపస్సు చేశాడు. మొదటి నెల రోజులు పళ్ళు భుజించి కృష్ణుడు శివ మంత్రాన్ని పఠించాడు. రెండవ నెలలో జలమే ఆహారంగా ఒంటి కాలి మీద నిలిచి తపస్సు చేశాడు. మూడవ నెలలో వాయుభక్షణ మాత్రమే చేస్తూ, కాలి బొటన వేలు మీద నిలబడి తపస్సు చేశాడు. అలా ఆరునెలలు నిష్ఠగా చేశాక శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు.
అప్పుడు కృష్ణుడు, ‘సంసారంలో బందీనైపోయాను. మాయా పాశాలలో చిక్కుకుపోయాను. నా ఈ తపస్సుకు కూడా ఈ సంసారమే కారణం. పుత్రార్థినై జాంబవతి కోసం సకామంగా తపస్సు చేశాను. మోక్ష ప్రదుడవైన నిన్ను ప్రసన్నుని చేసుకుని ముక్తి నిమ్మని కోరాలి కానీ లౌకికము, అశాశ్వతము అయిన కోరిక కోరుతున్నాను’ అంటాడు. శివుడు ‘నీకు చాలా మంది పుత్రులు కలుగుతారు. గృహస్థాశ్రమంలో చిరకాలం ఉంటావు. గాంధారి శాపం వల్ల, బ్రాహ్మణ శాపం వల్ల నీ వంశం అంతరిస్తుంది. ఇది ఇలాగే జరగవలసి ఉంది’ అని అంటాడు.
చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!
ఆకలి, నిద్ర, భయం, శోకం, హర్షం, మరణం ఇవన్నీ మానవ దేహం ధరించిన వారికి తప్పవు. మానుష జన్మలో మానుష లక్షణాలే ఉంటాయి. మాయాశక్తి సర్వులనూ ప్రేరేపిస్తుంది. స్వతంత్రురాలు ఆ జగదీశ్వరి మాత్రమే అని వ్యాసుడు దేవీ మహాత్మ్యాన్ని దేవీ భాగవతంలో చెపుతాడు. ఆ దేవిని నిరంతరం ధ్యానించటం ద్వారా లౌకిక సుఖాల పట్ల కొంతైనా విరక్తి సాధించవచ్చునంటారు పెద్దలు.
ఇదీ చదవండి: Diwali 2025: పూజ ఇలా చేస్తే, అమ్మవారి కటాక్షం పూర్తిగా మీకే!
– డా. చెంగల్వ రామలక్ష్మి