
PC: BCCI
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) సహనం కోల్పోయాడు. ‘‘ఇక్కడి నుంచి వెళ్లిపో’’ అంటూ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో భాగంగా ఢిల్లీ స్టార్క్‌ను రూ. 11. 75 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.
ఈ క్రమంలో ఈ సీజన్‌లో ఢిల్లీ (Delhi Capitals) తరఫున పదకొండు మ్యాచ్‌లు ఆడి పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు స్టార్క్. చివరగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు బరిలోకి దిగాడు. అయితే, భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాలలో బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) విధించడంతో పంజాబ్- ఢిల్లీ మ్యాచ్ అర్దంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.
భార్య అలిసా హేలీతో కలిసి
ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించి.. ఆపై కట్టుదిట్టమైన భద్రత నడుమ ఢిల్లీకి చేర్చింది. ఈ పరిణామాలతో తీవ్ర భయాందోళనకు లోనైన స్టార్క్, అతడి భార్య అలిసా హేలీ ఢిల్లీకి చేరుకుని.. వెంటనే స్వదేశానికి పయనమయ్యారు.
ఇక్కడి నుంచి పో..
ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి స్టార్క్ దగ్గరగా వెళ్లి వీడియో తీసే ప్రయత్నం చేశాడు. దీంతో అతడు పక్కకు వెళ్లిపో అంటూ సైగ చేశాడు. అయితే, కాసేపటి తర్వాత సదరు వ్యక్తి మరోసారి స్టార్క్ దగ్గరికి వెళ్లి పలకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆసీస్ బౌలర్.. ‘‘పో.. పో.. ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపో’’ అన్నట్లుగా విసుక్కున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో చాలా మంది స్టార్క్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అసలే భయపడిన వాడిని మరింత భయపెట్టడం సరికాదంటూ సెటైర్లు వేస్తుండగా... మరికొందరు మాత్రం స్టార్క్ అంతలా విసుక్కోవాల్సిన అవసరం లేదని.. ఏదేమైనా ఒకరి గోప్యతకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడం ఏమిటని సదరు వ్లాగర్‌కు చివాట్లు పెడుతున్నారు.
మే 17 నుంచి తిరిగి ప్రారంభం
ఇదిలా ఉంటే... మే 17 నుంచి ఐపీఎల్-2025 తిరిగి ప్రారంభం కానుంది. అయితే, ఢిల్లీకి ఆడుతున్న ఆసీస్ స్టార్లు స్టార్క్, జేక్ ఫ్రేజర్-మెగర్క్ తిరిగి ఇండియాకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇష్టమైతేనే భారత్‌కు తిరిగి వెళ్లవచ్చు అని క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లకు సూచించగా.. స్వదేశంలోనే ఉండేందుకు వీరిద్దరు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఢిల్లీకి లీగ్ దశలో ఇంకో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 13 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతున్న అక్షర్ సేన.. ప్లే ఆఫ్స్‌నకు గురిపెట్టింది. అయితే, స్టార్క్, మెగర్క్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం తీవ్ర ప్రభావం చూపనుంది.
చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్
Go away😭
pic.twitter.com/hqkyHzCEg4— Ghar Ke Kalesh (@gharkekalesh) May 15, 2025