రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో 66 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన అదరగొట్టిన కంగారులు.. సిరీస్ వైట్‌వాష్ నుంచి తప్పించుకున్నారు. ఆఖరి వన్డేలో ఆసీస్ టాపర్డర్ బ్యాటర్లు మిచెల్ మార్ష్(96), స్టీవ్ స్మిత్(74), మార్నస్ లబుషేన్(72), వార్నర్(56) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
దీంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 352 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ 4 వికెట్లతో అదరగొట్టాడు. భారత్‌తో వన్డే సిరీస్‌ను విజయంతో ముగించడంపై ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. స్టార్క్, మ్యాక్స్‌వెల్ మంచి రిథమ్‌లో ఉండడం జట్టుకు ఎంతో అవసరమని కమ్మిన్స్ తెలిపాడు.
కాగా వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓటమి తర్వాత ఆసీస్‌కు దక్కిన తొలి విజయం ఇది. భారత్‌తో సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఆ తర్వాత టీమిండియాతో తొలి రెండు వన్డేల్లో ఆసీస్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
"వరల్డ్‌కప్‌కు ముందు భారత గడ్డపై అద్భుత విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. అదే విధంగా ఛానళ్ల తర్వాత జట్టులోకి స్టార్క్, మ్యాక్స్‌వెల్ మొదటి మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వీరిద్దరూ ఇదే జోరును కొనసాగించాలని ఆశిస్తున్నాను.
టోర్నమెంట్ తొలి భాగానికి ట్రావెస్ హెడ్ అందుబాటులో ఉండడు. కాబట్టి వార్నర్‌తో కలిసి మిచెల్ మార్ష్ ఓపెనింగ్ చేస్తాడు. ఈ మ్యాచులో మార్ష్, వార్నర్ ఇన్నింగ్స్ ఆరంభించిన తీరు అద్భుతం. వారిని చూస్తే ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీలా కన్పించింది.
అగర్ కూడా టోర్నీకి దూరమయ్యే ఛాన్స్ ఉంది. అతడి స్ధానంలో ఎవరని ఆడించాలన్నది ఇంకా నిర్ణయించలేదని" పోస్ట్ మ్యాచ్ ప్రేజెంట్‌షన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.
చదవండి: WC 2023: స్వదేశానికి సౌతాఫ్రికా సారథి బవుమా పయనం.. కెప్టెన్‌గా మార్కరమ్


