యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బాక్సింగ్ డే టెస్టు డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును మంగళవారం ప్రకటించింది. అయితే ఆసీస్ జట్టులో అనుహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరమయ్యాడు.
అతడి స్దానంలో తిరిగి వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. అనారోగ్యం కారణంగా మూడో టెస్టుకు ఆఖరి నిమిషంలో దూరమైన స్మిత్.. తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఇక కమ్మిన్స్‌తో పాటు స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా అందుబాటులో లేడు.
అడిలైడ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో లియోన్ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో అతడు ఆఖరి రెండు టెస్టులకు కూడా దూరమయ్యాడు. అతడి స్ధానంలో యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ జట్టులోకి వచ్చాడు. మాట్ కుహ్నెమాన్, కోరీ రోచిసియోలి వంటి స్పిన్నర్లు ఉన్నప్పటికి సెలక్టర్లు మర్ఫీ వైపే మొగ్గు చూపారు.
ఈ విక్టోరియన్ ఆఫ్ స్పిన్నర్ గతంలో లియోన్ గైర్హాజరీలో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక కమ్మిన్స్ స్ధానంలో జే రిచర్డ్‌సన్‌కు చోటు దక్కింది. ఈ వెస్ట్ ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ చివరగా ఆసీస్ తరపున టెస్టు మ్యాచ్ 2021లో ఆడాడు. ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల తర్వాత అతడి రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. కాగా తొలి మూడు టెస్టుల్లో విజయం సాధించిన ఆసీస్.. యాషెస్ సిరీస్‌ను ఇప్పటికే 3-0 తేడాతో సొంతం చేసుకుంది.
బాక్సింగ్ డే టెస్టుకు ఆసీస్ జట్టు ఇదే..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నేజర్, జే రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్


