source: X
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో లెవల్-1 కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినందుకు గానూ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు వార్నింగ్ వచ్చింది. ఈ టోర్నీలో బెల్‌ఫాస్ట్ వోల్వ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మ్యాక్సీ.. డబ్లిన్ గార్డియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అసభ్య పదజాలం వినియోగించాడు. ఫలితంగా నిర్వహకులు అతడిపై చర్యలు తీసుకున్నారు.
ఈ విషయానికి సంబంధించి మ్యాక్స్‌వెల్ తన తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా మందలింపుతో సరిపెట్టారు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ బ్యాట్‌తో చెలరేగి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. కేవలం 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. తద్వారా తొలుత బ్యాటింగ్ చేసిన అతడి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
బెల్‌ఫాస్ట్ జట్టులో మ్యాక్స్‌వెల్‌తో పాటు మార్క్ చాప్‌మన్ (54) కూడా రాణించాడు. డబ్లిన్ బౌలర్లలో క్రిస్ వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. జోష్ లిటిల్ 2, హోలార్డ్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.
అనంతరం 185 పరుగుల లక్ష్య ఛేదనలో డబ్లిన్ జట్టు చేతులెత్తేసింది. మార్క్ అదైర్ (2-26), ఫ్రెడ్ క్లాస్సెన్ (2-26), హంఫ్రేస్ (2-23), నేత్రావాల్కర్ (1-24), క్రిస్ జోర్డాన్ (1-30) ధాటికి 9 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. తద్వారా బెల్‌ఫాస్ట్ జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మెరుపు అర్ద శతకంతో సత్తా చాటిన మ్యాక్స్‌వెల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
చదవండి: వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం


