
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో గెలుపొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంటూ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో మ్యాచ్‌లో ఇలాంటి విజయం ఎంతో ప్రత్యేకమని.. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ గర్వాన్ని తలకెక్కించుకోనని చెబుతున్నాడు.
111 పరుగులకే ఆలౌట్
ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్ మంగళవారం కేకేఆర్‌తో తలపడింది. ముల్లన్‌పూర్‌లో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఆతిథ్య పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, అనూహ్య రీతిలో 111 పరుగులకే ఆలౌట్ అయింది.
ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (30) ఫర్వాలేదనిపించగా.. ఇన్ ఫామ్ బ్యాటర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది.
కేకేఆర్ బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. పేసర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లతో చెలరేగాడు. అన్రిచ్ నోర్జే, వైభవ్ అరోరా చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
అంచనాలను నిజం చేస్తూ..
టార్గెట్ పూర్తి చేసే దిశగా పయనిస్తున్న వేళ.. శ్రేయస్ అయ్యర్ తమ వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను రంగంలోకి దించాడు. అయ్యర్ అంచనాలను నిజం చేస్తూ.. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (17), అంగ్‌క్రిష్ రఘువన్షీ (37), రింకూ సింగ్ (2), రమణ్‌దీప్ సింగ్ (0) రూపంలో చహల్ నాలుగు కీలక వికెట్లు కూల్చాడు. తద్వారా కేకేఆర్ బ్యాటింగ్ పతనాన్ని శాసించి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు.
అందుకే యుజీని పిలిపించా
ఈ క్రమంలో విజయానంతరం పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నా మనసు చెప్పిన మాట విన్నాను. బంతి కాస్త టర్న్ అవుతుందని అనిపించింది. అందుకే యుజీని పిలిచి పని అప్పగించాను.
సరైన సమయంలో సరైన ఆటగాళ్లను అటాక్ చేయాలని మేము ప్రణాళికలు రచించుకున్నాం. వాటిని యుజీ చక్కగా అమలు చేశాడు. ఇలాంటి విజయాలు ఎంతో ప్రత్యేకం. అంతకంటే నేనేమీ ఎక్కువగా చెప్పలేను.
నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు వికెట్ అంత బౌన్సీగా అనిపించలేదు. అయితే, ఈ వికెట్‌పై మేము మెరుగైన స్కోరే సాధించామని అనుకుంటున్నా. అంతేకాదు పదహారు పరుగుల తేడాతో కేకేఆర్‌పై గెలిచాం కూడా.
తప్పులు చేసే ఆస్కారం కల్పించాం
యుజీ బంతితో రంగంలోకి దిగినప్పుడు మా అంచనాలు, ఆశలు మిన్నంటాయి. అతడు వాటిని నిజం చేశాడు. ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాలనే తలంపుతో వాళ్ల కళ్లెదుటే ఫీల్డింగ్‌లో వడివడిగా మార్పులు చేస్తూ.. వాళ్లు తప్పులు చేసే ఆస్కారం కల్పించాం.
ఈ విజయం ప్రత్యేకమైనదే అయినా గర్వాన్ని తలకెక్కించుకోకుండా ఉండాలి. ఈ మ్యాచ్‌లో మాకెన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. వాటిని స్వీకరిస్తూ.. తప్పులు సరిచేసుకుంటూ మరింత గొప్పగా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాం’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్,. కానీ అతడిని రిటైన్ చేసుకోవడంలో కోల్‌కతా విఫలమైంది.
కేకేఆర్‌పై ప్రతీకారం తీరింది!
మెగా వేలంలోనూ పంజాబ్ శ్రేయస్ అయ్యర్ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేసిన సమయంలోనూ.. తమకు అవసరం లేదని విడిచిపెట్టింది. ఇక పంజాబ్ సారథిగా, బ్యాటర్ ఈ సీజన్‌లో శ్రేయస్ దుమ్ములేపుతున్నాడు. ఇప్పటికి ఆరు మ్యాచ్‌లలో పంజాబ్‌ను నాలుగింట గెలిపించాడు. బ్యాటర్‌గా ఇప్పటికి 250 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అందుకే ఈ విజయం అతడికి మరింత ప్రత్యేకమైందని ప్రత్యేకంగా చెప్పాలా?!
ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ కోల్‌కతా
టాస్: పంజాబ్.. మొదట బ్యాటింగ్
పంజాబ్ స్కోరు: 111 (15.3)
కోల్‌కతా స్కోరు: 95 (15.1)
ఫలితం: కోల్‌కతాపై 16 పరుగుల తేడాతో పంజాబ్ విజయం.
చదవండి: KKR Vs PBKS: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’
KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. ఎట్టకేలకు పైసా వసూల్ ప్రదర్శన!.. చహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటా
Moments they will never forget 🤩
🎥 All the 𝙍𝙖𝙬 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨 from a thrilling ending and memorable victory as #PBKS created history in front of a buzzing home crowd ❤🥳#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/mndhJxEt5X— IndianPremierLeague (@IPL) April 16, 2025