‘ఐదు’తో అదరగొట్టారు | Sakshi
Sakshi News home page

‘ఐదు’తో అదరగొట్టారు

Published Mon, Sep 25 2023 3:30 AM

Five medals for India on the first day of the Asian Games - Sakshi

ఈసారి పతకాల వేటలో ‘సెంచరీ’ దాటాలని చైనాలో అడుగుపెట్టిన భారత క్రీడాకారులు తొలిరోజే పతకాల ఖాతా తెరిచారు. 19వ ఆసియా క్రీడల్లో మొదటి రోజు ఐదు పతకాలతో అదరగొట్టారు. స్వర్ణ పతకం అందకపోయినా మూడు రజతాలు, రెండు కాంస్యాలతో శుభారంభం చేశారు. అంచలను అందుకుంటూ షూటర్లు తమ గురిని పతకాలపై పెట్టగా... రోయింగ్‌లోనూ భారత క్రీడాకారులు తమ సత్తా చాటుకున్నారు. మహిళల బాక్సింగ్, పురుషుల హాకీ, టెన్నిస్‌ క్రీడాంశాల్లోనూ మనోళ్లు రాణించారు. టేబుల్‌ టెన్నిస్, వాలీబాల్, మహిళల ఫుట్‌బాల్‌లో భారత్‌ పతకాల రేసు నుంచి ని్రష్కమించారు.

హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో తొలి రోజు భారత క్రీడాకారులు మెరిపించారు. షూటింగ్‌లో రెండు, రోయింగ్‌లో మూడు పతకాలతో రాణించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగం టీమ్‌ ఈవెంట్‌లో రమితా జిందాల్, మెహులీ ఘోష్, ఆశి చౌక్సీలతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. క్వాలిఫయింగ్‌లో భారత బృందం 1886 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. హాన్‌ జియావు, యుటింగ్‌ హువాంగ్, జిలిన్‌ వాంగ్‌లతో కూడిన చైనా జట్టు 1896.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది.

గాన్‌హుయగ్, యసుజెన్, నరన్‌తుయాలతో కూడిన మంగోలియా జట్టు 1880 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించింది. క్వాలిఫయింగ్‌లో రమిత 631.9 పాయింట్లతో రెండో స్థానంలో, మెహులీ 630.8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌లో టాప్‌–8లో నిలిచిన వారి మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో ఫైనల్‌ను నిర్వహిస్తారు. ఫైనల్లో రమిత 230.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకోగా... మెహులీ 208.3 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. యుటింగ్‌ హువాంగ్‌ (252.7 పాయింట్లు) స్వర్ణం, హాన్‌ జియావు (251.3 పాయింట్లు) రజతం గెల్చుకున్నారు. 

రోయింగ్‌లో పురుషుల లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ ఈవెంట్‌లో అర్జున్‌ లాల్‌ జాట్‌–అరవింద్‌ సింగ్‌ ద్వయం రజత పతకంతో బోణీ కొట్టింది. భారత జోడీ 6ని:28.18 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. జున్‌జీ ఫాన్‌–మన్‌ సున్‌ (చైనా; 6ని:23.42 సెకన్లు) జంట స్వర్ణ పతకం సాధించింది. పురుషుల పెయిర్‌ విభాగంలో బాబూలాల్‌ యాదవ్‌–లేఖ్‌ రామ్‌ జోడీ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది.

ఫైనల్‌ రేసులో బాబూలాల్‌–లేఖ్‌ రామ్‌ జంట 6ని:50.41 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానాన్ని దక్కించుకుంది. అనంతరం పురుషుల కాక్స్‌డ్‌ ఎయిట్‌ ఈవెంట్‌లో భారత జట్టు రజతం గెల్చుకుంది. నీరజ్, నరేశ్‌ కల్వానియా, నితీశ్‌ కుమార్, చరణ్‌జీత్‌ సింగ్, జస్విందర్‌ సింగ్, భీమ్‌ సింగ్, పునీత్‌ కుమార్, ఆశిష్‌లతో కూడిన భారత జట్టు 5ని:43.01 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని పొందింది. 

వాలీబాల్‌లో భారత పురుషుల జట్టు పతకం రేసు నుంచి నిష్క్రమించింది. క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 16–25, 18–25, 17–25తో జపాన్‌ చేతిలో ఓడిపోయింది. పురుషుల టెన్నిస్‌ డబుల్స్‌ విభాగంలో సాకేత్‌ మైనేని–రామ్‌కుమార్‌ (భారత్‌) 6–2, 6–3తో అభిషేక్‌–ప్రదీప్‌ (నేపాల్‌)లపై గెలిచారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ 6–0, 6–0తో మార్కో టిన్‌ (మకావు)పై ఘనవిజయం సాధించాడు.

ఏషియాడ్‌లో నేటి భారతీయంమెడల్‌ ఈవెంట్స్‌ 
షూటింగ్‌: పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్, వ్యక్తిగత విభాగం: రుద్రాం„Š  పాటిల్, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్, దివ్యాంశ్‌ (ఉదయం గం. 6:30 నుంచి 9 వరకు).  
మహిళల క్రికెట్‌ ఫైనల్‌: భారత్‌గీశ్రీలంక (ఉదయం గం. 11:30 నుంచి). 
రోయింగ్‌: పురుషుల సింగిల్‌ స్కల్స్‌ (బల్‌రాజ్‌ పన్వర్‌; ఉదయం గం. 7 నుంచి);  పురుషుల క్వాడ్రాపుల్‌ స్కల్స్‌ (ఉదయం గం. 8:30 నుంచి); మహిళల ఎయిట్‌ (ఉదయం గం. 8:50 నుంచి).   

Advertisement
 
Advertisement
 
Advertisement