
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. 49వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమితో ఈ సీజన్‌లో సీఎస్‌కే ఖేల్ ఖతమైంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.
ఈ సీజన్‌లో సీఎస్‌కే మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 3న ఆర్సీబీ, మే 7న కేకేఆర్, మే 12న రాజస్థాన్, మే 18న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
కాగా, ఓ ఐపీఎల్ సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలవడం ఐదు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఇది కొత్తేమీ కాదు. 2020 సీజన్‌లో కూడా ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది.
ఐపీఎల్ ప్రారంభం నుండి అత్యధిక సార్లు తొలుత ఎలిమినేట్ అయిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఈ ఫ్రాంచైజీ అత్యధికంగా మూడు సీజన్లలో అన్ని జట్లకంటే ముందే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఢిల్లీ తర్వాత డెక్కన్ ఛార్జర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఆర్సీబీ, సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ తలో రెండు సీజన్లలో అన్నిటి కంటే ముందే టైటిల్ వేట నుంచి నిష్క్రమించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పూణే వారియర్స్ ఇండియా, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ తలో సారి అన్ని జట్ల కంటే ముందే టైటిల్ వేటను ముగించాయి.
సీజన్ల వారీగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి మొదట నిష్క్రమించిన జట్లు..
2008- డెక్కన్ ఛార్జర్స్
2009- కేకేఆర్
2010- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
2011- డెక్కన్ ఛార్జర్స్
2012- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
2013- పూణే వారియర్స్ ఇండియా
2014- ఢిల్లీ క్యాపిటల్స్
2015- పంజాబ్ కింగ్స్
2016- రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్
2017- ఆర్సీబీ
2018- ఢిల్లీ క్యాపిటల్స్
2019- ఆర్సీబీ
2020- సీఎస్‌కే
2021- సన్‌రైజర్స్ హైదరాబాద్
2022- ముంబై ఇండియన్స్
2023- ఢిల్లీ క్యాపిటల్స్
2024- ముంబై ఇండియన్స్
2025- సీఎస్‌కే
కాగా, ప్రస్తుత సీజన్‌లో సీఎస్‌కే ఎలిమినేట్ అయిన మరుసటి రోజే రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం మరో రెండు జట్లు ప్రమాదం అంచుల్లో (ఎలిమినేషన్) ఉన్నాయి. వీటిలో సన్‌రైజర్స్ భవితవ్యం ఈ రోజే తేలిపోతుంది. కేకేఆర్ ఫేట్ డిసైడ్ కావాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. ఇవాళ (మే 2) సన్‌రైజర్స్ గుజరాత్ టైటాన్స్‌ను వారి సొంత మైదానంలో ఢీకొట్టనుంది.