
Photo Courtesy: BCCI/IPL
లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ (Digvesh Singh Rathi)- సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తీరును టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తప్పుబట్టాడు. ఈ ఇద్దరు భారత క్రికెటర్ల నుంచి ఇలాంటి అనుచిత ప్రవర్తన ఊహించలేదన్నాడు.
అసలేం జరిగిందంటే... లక్నో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (LSG vs SRH) చేతిలో ఓడింది. సోమవారం జరిగిన ఈ కీలక పోరులో రిషభ్ పంత్ సేన 205 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.
పవర్‌ప్లేలో భారీషాట్లతో విరుచుకుపడిన అభిషేక్
అయితే, లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్ ఓపెనర్లలో అభిషేక్... పవర్‌ప్లేలో భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా రవి బిష్ణోయి బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది సత్తా చాటాడు. మొత్తంగా 20 బంతుల్లోనే 59 పరుగులతో చెలరేగి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ వైపు తిప్పేశాడు.
గొడవపడిన దిగ్వేశ్, అభిషేక్
ఇలా జోరుమీదున్న అభిషేక్ శర్మను దిగ్వేశ్ సింగ్ రాఠీ.. తన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ 8వ)లో అవుట్ చేసి ఎప్పట్లాగే నోట్‌బుక్ సంబరాలు చేసుకున్నాడు. వెళ్లు.. వెళ్లు అన్నట్లుగా సైగ చేశాడు. ఈ సమయంలో క్రీజు నుంచి నిష్క్రమిస్తున్న అభిషేక్ దిగ్వేశ్‌ను చూసి ఏదో అన్నాడు.
వెంటనే రాఠీ అతడివైపు దూసుకొచ్చి వాగ్వావాదానికి దిగాడు. వెంటనే ఫీల్డ్ అంపైర్లు కల్పించుకోవడంతో ఈ జగడం అక్కడితోనే ఆగిపోయింది. అయితే ఈ సీజన్‌లో దిగ్వేశ్ రాఠి పరిధి దాటడం ఇది మూడోసారి! ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం దిగ్వేశ్ సింగ్‌పై మ్యాచ్ నిషేధం పడింది.
మ్యాచ్ ఆడకుండా నిషేధం
‘ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని అతిక్రమించిన లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించాం. ఈ ఒక్క సీజన్‌లోనే నియమావళిలోని ‘లెవెల్ 1’ను మూడోసారి అతిక్రమించడంతో 2 డీమెరిట్ పాయింట్లు కూడా విధించాం.
ఇదివరకే అతడి ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు ఉండటంతో మొత్తం 5 డీమెరిట్‌ల కారణంగా ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేశాం’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 1న పంజాబ్ కింగ్స్‌తో, 4న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లోనూ దిగ్వేశ్ ఇలాగే అతి సంబరాలతో డీమెరిట్ పాయింట్లకు గురయ్యాడు.
అదే విధంగా.. సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మపై కూడా ఐపీఎల్ నిర్వాహకులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ జత చేశారు. ఈ ఘటనపై స్పందించిన సురేశ్ రైనా.. దిగ్వేశ్- అభిషేక్‌ల తీరును విమర్శించాడు.
మీరు భారత క్రికెటర్లని గుర్తుపెట్టుకోండి
స్టార్ స్పోర్ట్స్ కామెంట్రీలో భాగంగా... ‘‘దిగ్వేశ్ రాఠీ నోట్‌బుక్‌లో అభిషేక్ శర్మ పేరు కూడా చేరిపోయింది. అప్పుడే ఈ ‘యుద్ధం’ జరిగింది. నేను నిన్నేమీ అనలేదని దిగ్వేశ్ అభిషేక్‌కు చెప్పినట్లు కనిపించింది.
ఏదేమైనా ఇద్దరూ తప్పు చేశారు. ఇద్దరూ భారత ఆటగాళ్లే. వారి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదు’’ అని సురేశ్ రైనా పెదవి విరిచాడు.
గౌరవం ఇవ్వడం నేర్చుకో
అదే విధంగా.. భారత మరో మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం కాస్త కష్టంగానే ఉన్నా.. తప్పదంటూ దిగ్వేశ్‌ను విమర్శించాడు. అయితే, రాఠీ తన ఆటలో దూకుడు కొనసాగిస్తూనే.. మైదానంలోని ప్రతీ ఆటగాడికి గౌరవం ఇస్తేనే విజయవంతంగా ముందుకు సాగగలడని అభిప్రాయపడ్డాడు.
చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్‌కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
The intensity of a must-win clash! 🔥#DigveshRathi dismisses the dangerous #AbhishekSharma, & things get heated right after! 🗣️💢
Is this the breakthrough #LSG needed to turn things around? 🏏
Watch the LIVE action ➡ https://t.co/qihxZlIhqW #IPLRace2Playoffs 👉 #LSGvSRH |… pic.twitter.com/TG6LXWNiVa— Star Sports (@StarSportsIndia) May 19, 2025