Tilak Varma: ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు.. దటీజ్‌ తిలక్‌ వర్మ

Fans Praise Mumbai Indians Tilak Varma Given All IPL Money To Father - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ చరిత్రలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఒక జట్టు ఇలాంటి ప్రదర్శన చేయడం క్రికెట్‌ ఫ్యాన్స్‌ కూడా జీర్ణించుకోలేకపోయారు. సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్‌ 4 విజయాలు.. 10 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే ముంబై ఇండియన్స్‌ జట్టుగా విఫలమైనా.. ఒకరిద్దరు మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. అందులో సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌లను మినహాయిస్తే మరొకరు తెలుగుతేజం తిలక్‌ వర్మ.

ముంబై ఇండియన్స్‌ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన తిలక్‌ వర్మ.. డెబ్యూ సీజన్‌లోనే అదరగొట్టే ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్‌లాడిన తిలక్‌ వర్మ 397 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. తిలక్‌ వర్మ ఆటతీరుపై రోహిత్‌ శర్మ సహా ముంబై ఇండియన్స్‌ కోచ్‌ మహేళ జయవర్దనే ప్రశంసల వర్షం కురిపించారు.  అతను ఆడుతున్నది  డెబ్యూ సీజన్‌ అయినప్పటికి.. ఐదు, ఆరు సీజన్‌ల అనుభవం తిలక్‌లో కనిపించిందని పేర్కొన్నారు.


కాగా  ముంబై ఇండియన్స్‌ తిలక్‌వర్మను రూ. 1.70 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగొచ్చిన తిలక్‌ వర్మ.. టోర్నీ ద్వారా తనకు వచ్చిన రూ. 1.70 కోట్లలో ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా తండ్రికే మొత్తం డబ్బును అందజేశాడు.  ఈ విషయాన్ని తిలక్‌ వర్మ ది వీక్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. ''నా బుర్రలో ఆట తప్ప ఇంకేం ఆలోచనలు రానివ్వను. ఐపీఎల్‌ ద్వారా నేను పొందిన మొత్తాన్ని నా తండ్రికి ఇచ్చేశాను. ఏ వ్యక్తి అయినా డబ్బుకు దాసోహం అవ్వడం సహజం. అందుకే డబ్బు ఉంచుకోవడం ద్వారా వచ్చే అనర్థాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. మా నాన్నకు డబ్బు ఇస్తూ.. 'ప్లీజ్‌ నన్ను వాటికి కాస్త దూరంగా ఉంచండి' అని'' పేర్కొన్నా అంటూ తెలిపాడు. 

ఒక ఎలక్ట్రిషియన్‌ కొడుకుగా ఎదిగిన తిలక్‌ వర్మ చిన్నప్పటి నుంచి దుబారా ఖర్చులు చేయడం అలవాటు చేసుకోలేదు. అందుకే తాను సంపాదించిన ప్రతీ రూపాయిని ఇప్పటికి తండ్రికే ఇవ్వడం అలవాటు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు..''తిలక్‌ వర్మ లాంటి వాళ్లు ఇంకా ఉన్నారా.. తండ్రి చాటు తనయుడు.. కష్టం అంటే ఏంటో తెలిసిన కుర్రాడు తిలక్‌ వర్మ'' అని పొగడ్తలతో ముంచెత్తారు.

చదవండి: ఓవైపు భారత్‌, సౌతాఫ్రికా మ్యాచ్‌.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు.. వీడియో వైరల్‌

ఐపీఎల్‌లో తెలుగుతేజం తిలక్‌ వర్మ కొత్త చరిత్ర

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top