
ఇంగ్లండ్‌తో 22 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న జింబాబ్వే జట్టుకు ఓటమి తప్పేలా లేదు. నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న నాలుగు రోజుల ఈ ఏకైక టెస్టులో రెండో రోజు కూడా ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 498/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 96.3 ఓవర్లలో 6 వికెట్లకు 565 పరుగులవద్ద డిక్లేర్ చేసింది.
తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించి ఓలీ పోప్ (166 బంతుల్లో 171; 24 ఫోర్లు, 2 సిక్స్‌లు) అవుటయ్యాడు. హ్యారీ బ్రూక్ (50 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని 3 వికెట్లు తీయగా... చివాంగ, సికందర్ రజా, మధెవెరెలకు ఒక్కో వికెట్ లభించింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే జట్టు 63.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ (143 బంతుల్లో 139; 26 ఫోర్లు) వీరోచిత సెంచరీ చేశాడు. కెపె్టన్ క్రెయిగ్ ఇరి్వన్ (64 బంతుల్లో 42; 6 ఫోర్లు), సీన్ విలియమ్స్ (41 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ షోయబ్ బషీర్ 3 వికెట్లు తీయగా... అట్కిన్‌సన్, బెన్ స్టోక్స్‌లకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. స్యామ్ కుక్, జోష్ టంగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 300 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించకుండా జింబాబ్వేకు ఫాలోఆన్ ఇచ్చింది.
ఫలితంగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన జింబాబ్వే రెండో రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మరో 270 పరుగులు చేయాలి.