
జైస్వాల్ , ప్రసిధ్
రెండో రోజు 15 వికెట్ల పతనం
భారత్ 224 ఆలౌట్
ఇంగ్లండ్ 247 ఆలౌట్
చెరో 4 వికెట్లు తీసిన సిరాజ్, ప్రసిధ్
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 75/2
లండన్: అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టు రసకందాయంగా జరుగుతోంది. రెండో రోజును ఇరు జట్ల బౌలర్లు శాసించారు. దీంతో ఒక్క రోజే 15 వికెట్లు నేలకూలాయి. ముందుగా భారత్ తొలి ఇన్నింగ్స్ ఇలా మొదలవగానే అలా 224 పరుగుల వద్ద ముగిసింది. మరోవైపు జోరుగా మొదలైన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ అంతే జోరుగా కుప్పకూలింది. 92 పరుగుల వరకు వికెట్ కోల్పోని ఆతిథ్య జట్టు 247 పరుగులకే ఆలౌటైంది.
కేవలం 23 పరుగుల ఆధిక్యమే లభించగా... అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట నిలిచే సమయానికి 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. రాహుల్ (7), సాయి సుదర్శన్ (11) వెనుదిరగ్గా... యశస్వి జైస్వాల్ (49 బంతుల్లో 51 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడి అజేయ అర్ధ శతకంతో నిలిచాడు. జైస్వాల్‌తో ఆకాశ్‌దీప్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జైస్వాల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లు ఇంగ్లండ్ ఫీల్డర్లు వదిలేయడం కలిసొచ్చింది. ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది.
34 బంతుల్లోనే ముగిసె...
రెండో రోజు ఆట మొదలైన కొద్దిసేపటికే భారత్ ఆలౌటైంది. 204/6 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మిగిలిన నాలుగు వికెట్లను తొలి అర గంటలోనే కోల్పోయింది. మూడో ఓవర్లోనే ఓవర్‌నైట్ స్పెషలిస్ట్ బ్యాటర్ కరుణ్ నాయర్‌ను (109 బంతుల్లో 57; 8 ఫోర్లు) టంగ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 218 పరుగుల వద్ద ఏడో వికెట్ పడింది.
ఆ తర్వాత 6 పరుగుల వ్యవధిలోనే అట్కిన్సన్... వాషింగ్టన్ సుందర్ (55 బంతుల్లో 26; 3 ఫోర్లు), సిరాజ్ (0), ప్రసిధ్ కృష్ణ (0) వికెట్లను పడగొట్టాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 69.4 ఓవర్లలో 224 వద్ద ముగిసింది. రెండో రోజు భారత్ కేవలం 20 పరుగులే చేయగలిగింది. అట్కిన్సన్‌కు ఐదు వికెట్లు దక్కాయి.
ఓపెనింగ్ జోరులో...
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ దూకుడుగా మొదలైంది. క్రాలీ, డకెట్ పేసర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. సిరాజ్ మూడో ఓవర్లో క్రాలీ 2 ఫోర్లు కొడితే... ఆకాశ్‌దీప్ ఓవర్లో డకెట్ మూడు ఫోర్లు బాదాడు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఇలా ఎవరిని విడిచిపెట్టకుండా యథేచ్చగా ఆడేశారు. బౌండరీలు, సిక్స్‌లతో వన్డేను తలపించే ‘పవర్ ప్లే’లా సాగిన ఓపెనింగ్ జోరుతో ఇంగ్లండ్ 12 ఓవర్లలోనే 92 పరుగులు చేసింది.
ఈ దూకుడుకు మరుసటి ఓవర్లో డకెట్ (38 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను అవుట్ చేయడం ద్వారా ఆకాశ్‌దీప్ బ్రేకులేశాడు. 15వ ఓవర్లో ఇంగ్లండ్ వందకు చేరగా, క్రాలీ 42 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. 109/1 స్కోరు వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లారు.
రెండో సెషన్‌లో బౌలర్ల హవా
ఆ తర్వాత కూడా బజ్‌బాల్ ఆట ఆడిన క్రాలీని ప్రసి«ద్‌కృష్ణ పెవిలియన్ చేర్చాడు. ఇక్కడి నుంచి బౌలింగ్ ప్రతాపం మొదలైంది. సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విలువైన వికెట్లను పడేశాడు. పోప్ (22; 4 ఫోర్లు), జో రూట్ (29; 6 ఫోర్లు), బెథెల్ (6)లను వరుస విరామాల్లో సిరాజ్ అవుట్ చేయడంతో 196 పరుగుల వద్ద 5 వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోరు 200 దాటాక స్మిత్ (8), ఓవర్టన్ (0)లను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు.
215/7 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. టెయిలెండర్ల అండతో 57 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన బ్రూక్‌ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. తొలి రోజు ఫీల్డింగ్‌లో భుజానికి గాయమైన వోక్స్ ఈ మ్యాచ్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో 9 వికెట్లకే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుకు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
జట్టునుంచి బుమ్రా విడుదల
ఐదో టెస్టుకు దూరమైన పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను బీసీసీఐ జట్టు నుంచి విడుదల చేసింది. దీని వల్ల అతను ఈ టెస్టు జరిగే సమయంలో టీమ్‌తో పాటు ఉండాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌లో ముందుగా అనుకున్నట్లుగానే 3 టెస్టులే ఆడిన బుమ్రా 14 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత వచ్చే నెలలో భారత్ ఆసియా కప్ టి20 టోర్నీ ఆడనుంది. బుమ్రా ఇందులో ఆడతాడా లేదా అనే విషయంపై సెలక్టర్లు తర్వాత నిర్ణయం తీసుకుంటారు.
స్కోరు వివరాలు
భారత్ తొలిఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 2; రాహుల్ (బి) వోక్స్ 14; సుదర్శన్ (సి) స్మిత్ (బి) టంగ్ 38; గిల్ రనౌట్ 21; కరుణ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) టంగ్ 57; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 9; జురేల్ (సి) బ్రూక్ (బి) అట్కిన్సన్ 19; సుందర్ (సి) ఓవర్టన్ (బి) అట్కిన్సన్ 26; ఆకాశ్‌దీప్ నాటౌట్ 0; సిరాజ్ (బి) అట్కిన్సన్ 0; ప్రసి«ద్‌కృష్ణ (సి) స్మిత్ (బి) అట్కిన్సన్ 0; ఎక్స్‌ట్రాలు 38; మొత్తం (69.4 ఓవర్లలో ఆలౌట్) 224. వికెట్ల పతనం: 1–10, 2–38, 3–83, 4–101, 5–123, 6–153, 7–218, 8–220, 9–224, 10–224. బౌలింగ్: వోక్స్ 14–1–46–1, అట్కిన్సన్ 21.4–8–33–5, టంగ్ 16–4–57–3, ఓవర్టన్ 16–0–66–0, బెథెల్ 2–1–4–0.
ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్: క్రాలీ (సి) జడేజా (బి) ప్రసిధ్ 64, డకెట్ (సి) జురేల్ (బి) ఆకాశ్‌దీప్ 43; ఒలీ పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 22; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 29; బ్రూక్ (బి) సిరాజ్ 53; బెథెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 6; స్మిత్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 8; ఓవర్టన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రసిధ్ 0; అట్కిన్సన్ (సి) ఆకాశ్‌దీప్ (బి) ప్రసిధ్ 11; టంగ్ నాటౌట్ 0; వోక్స్ అబ్సెంట్ హర్ట్; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (51.2 ఓవర్లలో ఆలౌట్) 247. వికెట్ల పతనం: 1–92, 2–129, 3–142, 4–175, 5–195, 6–215, 7–215, 8–235, 9–247. బౌలింగ్: సిరాజ్ 16.2–1–86–4, ఆకాశ్‌దీప్ 17–0–80–1, ప్రసి«ద్‌కృష్ణ 16–1–62–4, జడేజా 2–0–11–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ బ్యాటింగ్ 51; రాహుల్ (సి) రూట్ (బి) టంగ్ 7; సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 11; ఆకాశ్‌దీప్ బ్యాటింగ్ 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (18 ఓవర్లలో 2 వికెట్లకు) 75. వికెట్ల పతనం: 1–46, 2–70. బౌలింగ్: అట్కిన్సన్ 6–2–26–1, టంగ్ 7–1–25–1, ఓవర్టన్ 5–1–22–0.